సంక్షిప్త వార్తలు (4)

రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం నాటికి 42.23 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 7.19 లక్షల మంది రైతుల నుంచి 9,289.72 కోట్ల విలువైన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది.

Updated : 27 May 2024 06:03 IST

42.23 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం నాటికి 42.23 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 7.19 లక్షల మంది రైతుల నుంచి 9,289.72 కోట్ల విలువైన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 4.34 లక్షల టన్నులు కొన్నారు. జగిత్యాలలో 3.86 లక్షల టన్నులు, నల్గొండలో 3.06 లక్షలు, యాదాద్రిలో 3.07 లక్షలు, కామారెడ్డిలో 3.01 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. కొనుగోళ్లు చివరి దశకు చేరుకోవడంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం క్రమక్రమంగా తగ్గుతోంది. కొద్దిరోజులుగా రోజుకు 70-80 వేల టన్నుల వరకు మాత్రమే వస్తోంది. గత సంవత్సరం మే 25 నాటికి 41.63 లక్షల టన్నుల వడ్లను కొనగా.. ఈసారి అదే తేదీ నాటికి 41.93 లక్షల టన్నుల కొనుగోళ్లు జరిగాయి.


గాలులు, వర్షాలతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

ఈనాడు, హైదరాబాద్‌: భారీ ఈదురుగాలులు, అకాలవర్షాలతో ఆదివారం సాయంత్రం పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటం, లైన్లు తెగిపోవడంతో కరెంట్‌ సరఫరాలో అక్కడక్కడ అంతరాయం ఏర్పడిందని, సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపడుతున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మేడ్చల్‌ జిల్లాల్లో ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు భారీ వృక్షాలు, కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై, స్తంభాలపై పడ్డాయి. ప్రభావిత జిల్లాల విద్యుత్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్లతో వెంటనే టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించి తగు సూచనలు ఇచ్చాం. అన్ని క్షేత్ర కార్యాలయాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో చాలావరకు సరఫరాను వెంటనే పునరుద్ధరించారు. నేల మీద పడిన కరెంటు తీగలు, స్తంభాల పరికరాలను తాకకుండా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏదైనా విద్యుత్‌ అత్యవసర పరిస్థితి ఏర్పడితే సమీపంలోని సిబ్బందికి లేదా డిస్కం కంట్రోల్‌ రూంకు సమాచారం అందించాలి’ అని ఆయన సూచించారు.


పాఠశాలల్లో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలి: పీఆర్‌టీయూ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా అన్నిచోట్ల పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని పీఆర్‌టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.చెన్నయ్య, ఎస్‌.భిక్షంగౌడ్, రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్‌ కుమార్‌లు వేర్వేరు ప్రకటనల్లో ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఆగిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను కొనసాగించాలన్నారు.


 

తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఏర్పాటు

నూతన ఆధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సల్మాన్, తిరుపతినాయక్‌లతో వ్యవస్థాపకుడు రాములు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సల్మాన్‌నాయక్‌ రాథోడ్, తిరుపతినాయక్‌లు ఎన్నికయ్యారు. సంఘం వ్యవస్థాపకుడు కె.రాములు అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే వ్యవసాయ శాఖలో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఈ సందర్భంగా నూతన కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే కొత్త నియామకాలు చేపట్టాలని అభ్యర్థించింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని