రెగ్యులర్‌ డీఎంఈ, డీహెచ్‌ల నియామకానికి కసరత్తు

తెలంగాణ ఏర్పాటు తరువాత తొలిసారిగా వైద్యారోగ్యశాఖలో కీలకమైన విభాగాధిపతుల పోస్టులను ఏర్పాటు చేసి, ఇన్‌ఛార్జుల స్థానంలో పూర్తిస్థాయి అధికారులను నియమించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

Published : 27 May 2024 03:04 IST

ఔషధ నియంత్రణ మండలిలో డైరెక్టర్‌ పోస్టు ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటు తరువాత తొలిసారిగా వైద్యారోగ్యశాఖలో కీలకమైన విభాగాధిపతుల పోస్టులను ఏర్పాటు చేసి, ఇన్‌ఛార్జుల స్థానంలో పూర్తిస్థాయి అధికారులను నియమించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఈ పోస్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చినట్లు సమాచారం. ఈ శాఖలో పదేళ్లుగా ఇన్‌ఛార్జి అధికారుల నియామకం వివాదాలకు కేంద్రంగా ఉంది. పలుమార్లు సీనియర్‌ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించి సీనియార్టీ అంశానికి సంబంధించి ఉత్తర్వులు తెచ్చుకున్నా ఇన్‌ఛార్జుల స్థానంలో పూర్తి స్థాయి అధికారుల నియామకం పూర్తి కాలేదు. ఈ వివాదాలకు ముగింపు పలికి శాఖలో ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకొస్తే మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

సీనియారిటీ అంశం కొలిక్కి..! 

రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఆరోగ్యశాఖలో ప్రధానమైన ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌(డీహెచ్‌), వైద్యవిద్య డైరెక్టర్‌(డీఎంఈ)లుగా ఇన్‌ఛార్జులే కొనసాగుతూ వస్తున్నారు. కీలకమైన ఈ రెండు పోస్టులకు తమకు అర్హత ఉన్నా ప్రభుత్వం ఇతరులను నియమిస్తోందని సీనియర్‌ ఉద్యోగులు కేసులు వేశారు. హైకోర్టు కూడా సీనియర్‌ ఉద్యోగులనే నిబంధనల మేరకు ఇన్‌ఛార్జులుగా నియమించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే వైద్య విద్య డైరెక్టర్‌ అంశంలో సీనియారిటీ జాబితా సిద్ధమైందని, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ సీనియారిటీ అంశం కూడా కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. దీంతో పాటు ఔషధ నియంత్రణ మండలిలో కొత్తగా డైరెక్టర్‌ పోస్టును ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పోస్టు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడంతో కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కూడా రెగ్యులర్‌ డైరెక్టర్‌ల నియామక ప్రక్రియను ముగించాలని ఉన్నతాధికారులను ఆదేశించడంతో ఆ దిశగా కార్యాచరణ వేగంగా జరుగుతోంది. వైద్య విద్య డైరెక్టరేట్‌ పరిధిలోనూ బోధనాసుపత్రుల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లతో సీనియారిటీ జాబితాను రూపొందించారు. మొదటి స్థానంలో ఉన్న శివరాంప్రసాద్‌ ఇప్పటికే డీఎంఈ(అడ్మినిస్ట్రేషన్‌)గా ఉండగా.. రెండో స్థానంలో ఉన్న నరేంద్రకుమార్‌ వనపర్తి వైద్యకళాశాల సూపరింటెండెంట్‌గా ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఎన్‌.వాణి ఇన్‌ఛార్జి డీఎంఈగా వ్యవహరిస్తున్నారు. ప్రజారోగ్యశాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌(డీహెచ్‌)గా రవీందర్‌నాయక్‌ ఉండగా రెగ్యులర్‌ అధికారి నియామకం కోసం సీనియారిటీ జాబితా సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని