నెహ్రూ ‘ప్రణాళికల’తోనే ప్రగతికి బాటలు పడ్డాయి

తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ తెచ్చిన పంచవర్ష ప్రణాళికలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయని అలహాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.రాజెన్‌ హర్షే పేర్కొన్నారు.

Updated : 28 May 2024 04:48 IST

అలహాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ మాజీ వీసీ ప్రొ.రాజెన్‌ హర్షె

గాంధీభవన్‌లో మాట్లాడుతున్న ప్రొ.రాజెన్‌ హర్షె, వేదికపై నేతలు అనంతుల శ్యాంమోహన్,
వీర్లపల్లి శంకర్, వీహెచ్, మహేశ్‌కుమార్‌గౌడ్, జీవన్‌రెడ్డి, సునీతారావు, అజారుద్దీన్‌ తదితరులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ తెచ్చిన పంచవర్ష ప్రణాళికలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయని అలహాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.రాజెన్‌ హర్షే పేర్కొన్నారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ మేధావుల విభాగం ఛైర్మన్‌ అనంతుల శ్యాంమోహన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొ.రాజెన్‌ హర్షె మాట్లాడుతూ... ‘‘నాడ[ు నెహ్రూ చాకచక్యంగా వ్యవహరించడంతోనే నేడు కశ్మీర్‌ మన దేశంలో అంతర్భాగంగా ఉంది. ఆర్టికల్‌ 370పై అప్పటి ఆయన నిర్ణయం తప్పేమీ కాదు. పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. ఇస్రోను అభివృద్ధి చేశారు. ఐఐటీలు, ఐఐఎంలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్‌ సెంటర్లు నెలకొల్పి విద్యారంగ దార్శనికుడిగా పేరు గడించారు’’ అని కొనియాడారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... నెహ్రూ ఆధ్వర్యంలోనే మనదేశం వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ... ఆరెస్సెస్, భాజపాలు నెహ్రూ ప్రతిష్ఠను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వీహెచ్‌ మాట్లాడుతూ... భారత్‌ శాస్త్ర, సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలబడటానికి  నెహ్రూ వేసిన పునాదే కారణమన్నారు. అనంతరం విలేకరులతో జగ్గారెడ్డి మాట్లాడుతూ... నెహ్రూ నాడు వ్యవసాయంతోపాటు ప్రాజెక్టులు, విద్యుత్‌ ఉత్పత్తికి ప్రాధాన్యమిచ్చారన్నారు. కార్యక్రమంలో   ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు.

నెహ్రూకు సీఎం రేవంత్‌ నివాళి 

ఈనాడు, హైదరాబాద్‌: తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి పూలమాల వేసి, నివాళి అర్పించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌ కుమార్, ఎమ్మెల్యే శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తన నివాసంలో నెహ్రూ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు