విద్యుత్‌ అంతరాయాలపై ప్రభుత్వం ఆరా!

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలపై వివరణ ఇవ్వాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలను(డిస్కంలు) ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది.

Updated : 28 May 2024 04:45 IST

నివేదిక పంపిన డిస్కంలు
పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి

సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కుడికుళ్ల వద్ద గాలులు, వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్‌ లైన్‌కు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలపై వివరణ ఇవ్వాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలను(డిస్కంలు) ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఇటీవల వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి, భువనగిరిలలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంపై ప్రతిపక్షాలు విమర్శించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై డిస్కంలను వివరణ కోరగా విద్యుత్‌ సరఫరా సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలపై రెండు డిస్కంలు ప్రభుత్వానికి నివేదికలు పంపాయి. వాటి ప్రకారం..గత ప్రభుత్వ హయాంలో 2023 జనవరి నుంచి మే వరకు ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో 33కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల కింద 490 సార్లు సాంకేతిక సమస్యలతో 1738 గంటలసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ ఏడాది అదే సమయంలో 293 సార్లు 698 గంటల పాటు సరఫరా ఆగింది. దీన్ని బట్టి ఈ ఏడాది 59.84 శాతం వరకు విద్యుత్‌ సరఫరా అంతరాయాలను తగ్గించినట్లు ఉత్తర డిస్కం ప్రభుత్వానికి వివరించింది. ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను 18.09 శాతం తగ్గించినట్లు పేర్కొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 33 కేవీ ఫీడర్లలో సరఫరా అంతరాయాలను 43.90 శాతం, ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను 14.61 శాతం తగ్గించినట్లు నివేదికలో పొందుపరిచాయి. 

వర్షాలు, పెనుగాలులతో సమస్యలు...

గత కొద్దిరోజుల్లో అకాల వర్షాలు, పెనుగాలులతో రాష్ట్రంలో 8,486 కరెంటు స్తంభాలు, 240 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని, వీటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు సిబ్బంది  శ్రమిస్తున్నారని డిస్కంలు తెలిపాయి. ఈ మరమ్మతులతో గంటలకొద్దీ విద్యుత్తు సరఫరా నిలిచిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాయి. వాస్తవానికి ప్రస్తుత వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గిందని, ఈ ఏడాది మార్చి 29న రాష్ట్రంలో మొత్తం  వినియోగం 290 మిలియన్‌ యూనిట్లు ఉంటే ఈ నెల 26న 188 మి.యూ.లకు తగ్గిపోయిందని డిస్కంలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని