ఆరు హోల్‌సేల్‌ మందుల డిస్ట్రిబ్యూషన్ల లైసెన్స్‌లు రద్దు

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి బిల్లులు లేకుండా మందులను కొనుగోలు చేసి విక్రయిస్తున్న ఆరు హోల్‌సేల్‌ మందుల డిస్ట్రిబ్యూషన్‌ సంస్థల లైసెన్స్‌లను 30 రోజులపాటు రద్దు చేస్తూ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) చర్యలు తీసుకుంది.

Published : 28 May 2024 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి బిల్లులు లేకుండా మందులను కొనుగోలు చేసి విక్రయిస్తున్న ఆరు హోల్‌సేల్‌ మందుల డిస్ట్రిబ్యూషన్‌ సంస్థల లైసెన్స్‌లను 30 రోజులపాటు రద్దు చేస్తూ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) చర్యలు తీసుకుంది. ఆ సంస్థలపై ప్రాసిక్యూషన్‌కు ఆదేశాలను జారీచేసినట్లు ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి నెలలో హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థలు దిల్లీ నుంచి ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌లు (మందుతో నిండినవి) భారీ మొత్తంలో బిల్లులు లేకుండా కొనుగోలు చేశాయి. వాటిని 40 శాతం కంటే ఎక్కువ డిస్కౌంట్‌తో విక్రయించినట్లు డీసీఏ సోదాల్లో తెలిసింది. దీంతో ఈ ఆరింటి నుంచి రూ.51.92 లక్షల విలువైన ఎలాంటి బిల్లులు లేని మందులను స్వాధీనం చేసుకున్నారు. పద్మారావునగర్‌కు చెందిన డ్రగ్‌ హబ్, రామంతపూర్‌కు చెందిన శ్రీ తిరుమల ఫార్మా, సుల్తాన్‌బజార్‌కు చెందిన శ్రీ పారస్‌మెడికల్‌ ఏజెన్సీ, నాగోల్‌కు చెందిన గణేష్‌ ఫార్మాడిస్ట్రిబ్యూటర్స్, కాప్రాకు చెందిన శ్రీ రాజరాజేశ్వరీ డిస్ట్రిబ్యూటర్స్, కాచిగూడకు చెందిన శ్రీ బాలాజీ ఏజెన్సీస్‌ల లైసెన్స్‌లు 30 రోజులపాటు సస్పెండ్‌ చేశామని డీజీ వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయం సహా ఇతర ఫిర్యాదులు ఉంటే 1800 599 6969కు తెలియజేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని