రూ.16.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ వాహనాన్ని పెద్దపల్లి జిల్లా రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంచిర్యాల జిల్లా చెన్నూరు వద్ద మంగళవారం పట్టుకున్నారు.

Published : 29 May 2024 04:53 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే: నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ వాహనాన్ని పెద్దపల్లి జిల్లా రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంచిర్యాల జిల్లా చెన్నూరు వద్ద మంగళవారం పట్టుకున్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఎం.శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సొల్లు పెద్దయ్య(36), సొల్లు హరికుమార్‌(26)లు గుంటూరుకు చెందిన సుబ్బారావు కర్ణాటకలోని కుస్తీ ప్రాంతంలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తుండగా తక్కువ ధరకు 5.5 క్వింటాళ్ల బీటీ-3 నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. రూ.16.50 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను రైతులకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడిచేసి వ్యాన్‌తో సహా నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌ యజమాని పెద్దయ్య, డ్రైవర్‌ హరికుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.1.8 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్, అదనపు అడ్మిన్‌ డీసీపీ రాజు, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ రవీందర్, టాస్క్‌ఫోర్స్‌ సీఐలు సంజయ్, చిన్ను, వ్యవసాయ ఏవో గ్లాడ్సన్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని