సేంద్రియం పేరిట నకిలీ ఎరువుల విక్రయాలు

ఇప్పటి వరకు నకిలీ పత్తి విత్తనాలనే విక్రయిస్తున్న విషయం వెలుగుచూడగా.. ఇప్పుడు అనుమతిలేని నకిలీ ఎరువులూ విక్రయిస్తున్న దారుణం ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలో బయటపడింది.

Published : 29 May 2024 04:53 IST

భీంపూర్, న్యూస్‌టుడే: ఇప్పటి వరకు నకిలీ పత్తి విత్తనాలనే విక్రయిస్తున్న విషయం వెలుగుచూడగా.. ఇప్పుడు అనుమతిలేని నకిలీ ఎరువులూ విక్రయిస్తున్న దారుణం ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలో బయటపడింది. రూ.5.55 లక్షల విలువైన 750 ఎరువుల సంచులతో కూడిన లారీని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ప్రదీప్‌కుమార్, వ్యవసాయాధికారి రవీందర్‌ వివరాలను వెల్లడించారు. నల్గొండకు చెందిన ఓ వ్యాపారి సేంద్రియ ఎరువుల పేరిట రైతులను బురిడీ కొట్టించే అక్రమ దందాకు తెరలేపాడు. కరంజి-టి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మధ్యవర్తిత్వంతో రైతుల పేర్లతో లారీలో 750 సంచులను మంగళవారం గ్రామానికి తరలించాడు. రైతులు ఎవరూ సంచులు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో నకిలీ దందా బయటపడింది. విషయం తెలుసుకున్న లారీ డ్రైవరు వాహనాన్ని గోముత్రి మీదుగా తీసుకొస్తుండగా.. ఎస్సై సిబ్బందితో కలిసి లారీని పట్టుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా సేంద్రియ ఎరువుల విక్రయాలకు నకిలీ అనుమతి పత్రం చూపించిన వైనం ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. గతంలోనే సదరు వ్యాపారి అక్రమ దందా బయటపడటంతో విక్రయ లైసెన్సును రద్దు చేశారు. ఆ తరువాత ఆకర్షణీయ సంచుల ప్యాకింగ్‌తో రైతులను మోసం చేసేలా నకిలీ ఎరువుల విక్రయాలను ప్రారంభించాడు. రూ.280 విలువ చేసే 40 కిలోల ఎరువు బస్తాను రూ.800కి ధర నిర్ణయించారని రైతులు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాలకు వచ్చి ఎరువులు, విత్తనాలు నేరుగా విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని ఏవో రైతులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని