సార్‌.. ఆ పిల్లల్లో మా వాళ్లున్నారా..!

‘సార్‌... పిల్లల్ని అమ్మే గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. మీరు రక్షించిన వారిలో మా వాళ్లున్నారా...’’ అంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తల్లిదండ్రులు రాచకొండ పోలీసుల్ని సంప్రదిస్తున్నారు.

Updated : 30 May 2024 09:28 IST

ఈనాడు, హైదరాబాద్‌

శిశువును మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగిస్తున్న రాచకొండ కమిషనర్‌ తరుణ్‌ జోషి

‘సార్‌... పిల్లల్ని అమ్మే గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. మీరు రక్షించిన వారిలో మా వాళ్లున్నారా...’’ అంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తల్లిదండ్రులు రాచకొండ పోలీసుల్ని సంప్రదిస్తున్నారు. కన్నబిడ్డల ఆనవాళ్లను చెబుతూ, వారిని గుర్తించి అప్పగించాలని అర్థిస్తున్నారు. రాచకొండ పరిధిలోని మేడిపల్లి పోలీసులు చిన్నారుల అక్రమ రవాణా ముఠాను అరెస్టు చేసి... 16 మంది చిన్నారుల్ని రక్షించిన విషయం తెలిసిందే. దీని గురించి మీడియా ద్వారా తెలుసుకున్న కొందరు తమ పిల్లలేమైనా ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 మంది పోలీసులకు ఫోన్‌ చేశారు. ఆయా వివరాలతో తమ వద్దకు రావాలని పోలీసులు వారికి సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కలకలం రేపిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్‌ కేసులో తవ్వేకొద్ది విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి.

బైక్‌ అంటే మగ.. స్కూటీ అంటే ఆడపిల్ల!

చిన్నారుల్ని అక్రమ రవాణా చేసే ఏజెంట్లలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి రవాణా చేసే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా కొందరు మహిళా ఏజెంట్లు తల్లుల్లా చిన్నారుల్ని తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో తేలింది. విక్రయాల విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు కోడ్‌భాష ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. బైక్‌ అంటే మగ, స్కూటీ అంటే ఆడపిల్ల అని పలుకుతారు. కొనుగోలు చేసే వారి నుంచి డబ్బు తీసుకుని తేదీ నిర్ణయిస్తే చాలు నెలల వయసున్న శిశువులను రెండు, మూడు రోజుల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేర్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులతో మాటలు కలిపి.. తమకు తెలిసినవారి వద్ద నెలల వయసున్న చిన్నారులు ఉన్నారని చెబుతూ విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితులైన కిరణ్, ప్రీతి(దిల్లీ), కన్నయ్య(పుణె)లు చిన్నారుల్ని ఎక్కువగా రాత్రి వేళల్లోనే తరలించినట్లు గుర్తించారు. 

ఐదేళ్లుగా అక్రమ తరలింపు 

ముఠా అరెస్టు నేపథ్యంలో ముంబయి పోలీసులు రాచకొండ అధికారులను సంప్రదించారు. వారి వద్దనున్న రికార్డులతో కేసును సరిపోల్చుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. నిందితుల్లో కొందరు ఐదేళ్ల నుంచి చిన్నారుల్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో విజయవాడకు చెందిన శారదది కీలక పాత్రగా గుర్తించారు. ఆమెపై ఇప్పటికే చిన్నారుల విక్రయానికి సంబంధించి మూడు కేసులున్నాయి. ముంబయిలోని కంజుమార్గ్‌ ఠాణాలో ఇటీవల ఓ కేసు నమోదైంది. 

విజయవాడలో మరో 8 మంది ఏజెంట్ల గుర్తింపు 

నిందితులిచ్చిన సమాచారం ప్రకారం విజయవాడలో మరో ఎనిమిది మంది ఏజెంట్లను పోలీసులు గుర్తించారు. విజయవాడకే చెందిన బలగం సరోజ, ముదావత్‌ శారద, పఠాన్‌ ముంతాజ్, జగన్నాథం అనురాధతో వారికున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. విజయవాడ, పుణె, దిల్లీల్లో ఉన్న ఇతర నిందితుల్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. నిందితులిచ్చిన సమాచారం ప్రకారం 60 మంది చిన్నారుల్ని దిల్లీ, పుణె నుంచి తీసుకొచ్చి విక్రయించినట్లు తేలింది. మేడిపల్లి పోలీసులు 16 మందిని గుర్తించారు. మిగిలిన 44 మంది ఎక్కడున్నారన్న అంశంపై దృష్టిసారించారు. నిందితులు శిశువుల్ని విక్రయించాక బాండ్‌ పేపర్ల మీద ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు గుర్తించారు. ఈ తతంగంపైనా దృష్టిపెట్టారు. 

కొత్తవారిని చూసి ఏడుస్తున్న చిన్నారులు 

తాము రక్షించిన 16 మంది చిన్నారుల్లో 14 మందిని పోలీసులు చిన్నారుల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించారు. మరో ఇద్దరి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం శిశువిహార్‌ సంరక్షణలో ఉన్న మొత్తం 14 మంది పిల్లలకు బుధవారం అక్కడి సిబ్బంది వైద్యపరీక్షలు నిర్వహించారు. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. శిశుసంక్షేమ శాఖ కమిషనర్‌ కాంతివెస్లీ, మేడ్చల్‌ సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ రాజారెడ్డి శిశువిహార్‌కు వెళ్లి పరిశీలించారు. తెలియని ప్రదేశం కావడంతో కొందరు చిన్నారులు కొత్త వారిని చూసి ఏడుస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సర్దుకుంటారనే భావనతో అధికారులు ఉన్నారు. 

కేసును సుమోటోగా తీసుకున్న ఎస్‌సీపీసీఆర్‌ 

చిన్నారుల అక్రమ రవాణా, దత్తత కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎస్‌సీపీసీఆర్‌) సుమోటోగా తీసుకుంది. పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి, అక్రమ రవాణా రాకెట్‌ వెనుక ఎవరున్నారో గుర్తించి, చర్యలు తీసుకోవాలని శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఎస్‌సీపీసీఆర్‌ ఛైర్‌పర్సన్‌ శ్రీనివాస్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని