రూ.500 కోట్ల సర్కారు భూముల కబ్జాయత్నం భగ్నం

హైదరాబాద్‌ సమీపంలోని గండిపేట మండలంలో రూ.500 కోట్ల సర్కారు భూముల కబ్జాకు యత్నించిన అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు కన్నెర్ర చేశారు.

Updated : 30 May 2024 07:51 IST

హైదరాబాద్‌ సమీపంలోని గంధంగూడలోని 9.36 ఎకరాలపై అక్రమార్కుల కన్ను
తప్పుడు పత్రాలతో సొంతం చేసుకునేందుకు ఓ మాజీ కార్పొరేటర్‌ పన్నాగం
ఆధారాలు సమర్పించకపోవడంతో ప్రహరీ, గుడిసెలను కూల్చేసిన రెవెన్యూ అధికారులు

గంధంగూడలోని సర్కారు స్థలంలో గుడిసె, రేకుల ప్రహరీ తొలగింపు

ఈనాడు, హైదరాబాద్‌- బండ్లగూడజాగీర్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ సమీపంలోని గండిపేట మండలంలో రూ.500 కోట్ల సర్కారు భూముల కబ్జాకు యత్నించిన అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు కన్నెర్ర చేశారు. గండిపేట మండలం గంధంగూడ గ్రామంలోని సర్వే నంబరు 51లో 9.36 ఎకరాల భూమికి సంబంధించి కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి.. స్థలం చుట్టూ రేకుల ప్రహరీ నిర్మించారు. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు ప్రణాళిక రచించారు. రెవెన్యూ అధికారులు వచ్చి ప్రహరీని కూల్చేస్తారన్న ముందస్తు అంచనాతో కొందరితో అప్పటికప్పుడు గుడిసెలు వేయించారు. వాటిని తొలగించేటప్పుడు ఆందోళన చేయిద్దామని ఆలోచన చేశారు. వారి పన్నాగాన్ని అధికారులు భగ్నం చేశారు. గండిపేట తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం రెవెన్యూ అధికారులు, పోలీసులు వెళ్లి.. అక్రమంగా వెలసిన గుడిసెలను, ప్రహరీని కూల్చేశారు. అవి సర్కారు భూములంటూ అక్కడ బోర్డులు పాతారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టామని, పోలీసులకు ఫిర్యాదు చేశామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.శశాంక తెలిపారు.

పదేళ్ల క్రితం నుంచే ప్రణాళిక

గండిపేట్‌ మండలం గంధంగూడ గ్రామంలోని సర్వే నంబర్‌ 51లో 9.36 ఎకరాల సర్కారు భూములున్నాయి. జంట జలాశయాలకు సమీపంలో.. హైదర్షాకోట్, సన్‌సిటీ పక్కనే ఉండడంతో వాటిని ఆక్రమించేందుకు సుమారు పదేళ్ల క్రితం ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్‌ ప్రయత్నాలు ప్రారంభించాడు. అప్పట్లో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో భూములను సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాడు. ఈ సర్వే నంబర్‌కు అటూ, ఇటూ ఉన్న భూముల వివరాలు తెలుసుకున్నాడు. అవి సర్కారు భూములు కావని, ముంతఖబ్‌ (వ్యక్తులు లేదా సంస్థలకు నిజాం ఇచ్చిన) భూములని పత్రాలు సృష్టించాడు. సబినా సుల్తానా అనే మహిళ, ఆమె వారసులు తమకు జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) ఇచ్చారంటూ హైకోర్టులో ఎ.అభిషేక్‌ పేరుతో నాలుగేళ్ల క్రితం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయించాడు. ఆ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో రంగారెడ్డి జిల్లా ట్రైబ్యునల్‌కు వెళ్లారు. సబినా సుల్తానా, ఆమె వారసులు జీపీఎ ఇచ్చిన ఎ.అభిషేక్‌కు భూములు కేటాయించాలంటూ ట్రైబ్యునల్‌ గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ఆధారంగా అప్పటి జిల్లా కలెక్టర్‌ అవి పట్టా భూములేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ-పాస్‌ పుస్తకాల కోసం అభిషేక్‌ గతేడాది మే నెలలో ధరణిలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత శాసనసభ ఎన్నికలు రావడంతో ధరణిలో ఇతని పేరున భూముల మార్పిడి జరగలేదు. కానీ, ఈ-పాస్‌ పుస్తకం మాత్రం వచ్చింది.

ఆక్రమణకు యత్నించిన ప్రభుత్వ భూమి


సీఎం రేవంత్‌ ఆదేశాలతో బయటపడ్డ అక్రమం

ప్రభుత్వ భూముల కబ్జాలను తొలగించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది జనవరిలో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్‌ జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూముల రికార్డులు పరిశీలిస్తుండగా గండిపేట్‌ మండలం గంధంగూడలోని 9.36 ఎకరాల సర్కారు భూమి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంతఖబ్‌ భూములపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం జిల్లా ట్రైబ్యునల్‌కు లేదని తెలుసుకున్న రంగారెడ్డి కలెక్టర్‌ కె.శశాంక.. వాటిని నిలిపివేశారు. 1955 నుంచి అవి ప్రభుత్వ భూములుగానే ఉన్నాయంటూ అభిషేక్‌కు స్పష్టంచేశారు. దీంతో అతను ఈ ఏడాది మార్చిలో హైకోర్టును ఆశ్రయించారు. భూములను విక్రయించేందుకు అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించారు. అభిషేక్‌ అభ్యర్థనను పరిశీలించి.. నిర్ణయం తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తోపాటు రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూములకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని రంగారెడ్డి కలెక్టర్‌ శశాంక తాఖీదులు జారీ చేయగా.. వాటిని అభిషేక్‌ సమర్పించలేదు. దీంతో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు యత్నించారంటూ అభిషేక్‌కు నోటీసులు జారీ చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు