ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల్లో అమ్మాయిల ముందంజ

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఐసెట్‌కు పోటీపడుతున్న అమ్మాయిల సంఖ్య అబ్బాయిలను దాటిపోతోంది.

Published : 05 Jun 2024 04:30 IST

ఐసెట్‌కు 2022 నుంచి వారి దరఖాస్తులే అధికం
ఈసారి మరింతగా పెరుగుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఐసెట్‌కు పోటీపడుతున్న అమ్మాయిల సంఖ్య అబ్బాయిలను దాటిపోతోంది. ఈ ధోరణి 2022 నుంచే మొదలైనా.. ఈసారి మరింత పెరగడం విశేషం. వైద్య విద్య(ఎంబీబీఎస్‌)తోపాటు సంప్రదాయ పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. తాజాగా వాటి సరసన ఎంబీఏ, ఎంసీఏ కూడా చేరాయి. 2022లో తొలిసారిగా ఐసెట్‌ దరఖాస్తుల్లో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల్ని దాటింది. 2022లో 783, 2023లో 1,709 మంది ఎక్కువగా ఉన్నారు. ఈసారి ఆ వ్యత్యాసం 3,777కు పెరిగింది. ఈ నెల 5, 6 తేదీల్లో జరిగే ఐసెట్‌కు మొత్తం 86,184 దరఖాస్తు వచ్చాయి. ఈ పరీక్షలో ఇదో రికార్డు అని కన్వీనర్‌ నర్సింహాచారి చెప్పారు.

ఎందుకు ఆసక్తి..?

ముఖ్యంగా ఎంబీఏలో చేరేందుకు అమ్మాయిలు ఎందుకు ఆసక్తి చూపుతున్నారనడానికి నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. ‘రాష్ట్రంలో ఏటా డిగ్రీ కోర్సుల్లో చేరుతున్న సుమారు 2.50 లక్షల మందిలో 60 శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారు. బీటెక్‌లో కూడా కనీసం 35-40 శాతం ఉంటున్నారు. ఎంబీఏలో ఏ డిగ్రీ వారైనా చేరొచ్చు. దానికితోడు ఆ కోర్సు చదివితే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు’ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. ఎంబీఏ చదివితే అటు టెక్నాలజీ, ఇటు మేనేజ్‌మెంట్‌ రంగాల్లో ఎదిగేందుకు దోహదపడుతుందని వారు భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెచ్‌సీయూ మాజీ ప్రో వైస్‌ ఛాన్స్‌లర్, మేనేజ్‌మెంట్‌ సీనియర్‌ ఆచార్యుడు బి.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. అబ్బాయిలు డిగ్రీ, బీటెక్‌ తర్వాత విదేశాల్లో ఉన్నత విద్యకు ఎక్కువగా వెళ్తున్నారని, దానివల్ల ఇక్కడ ఎంబీఏ, ఎంసీఏల్లో చేరుతున్న అమ్మాయిల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. విద్యార్థులు బీటెక్‌ తర్వాత వెంటనే ఎంబీఏ చదివితే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయనుకుంటున్నారని చెప్పారు. బీకాం చదివిన వారు గతంలో ఎంకాంలో చేరేవారని, ఇప్పుడు ఎంబీఏలో చేరుతున్నారని చెప్పారు. ఎంబీఏలో ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్‌ తదితర స్పెషలైజేషన్లు ఉన్నందున ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని