గ్రూపు-1 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ

గ్రూపు-1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ఈ నెల 9న జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది.

Updated : 05 Jun 2024 07:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూపు-1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ఈ నెల 9న జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. జూన్‌ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ పరీక్ష ఉన్నందున గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను మరో తేదీకి మార్చాలని ఎం.గణేశ్, భూక్యా భరత్‌లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో రెండు ఇంటెలిజెన్స్‌ పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, గ్రూప్‌-1కు 4 లక్షల మందికి పైగా ఆశావహులు పోటీపడుతున్నారని తెలిపారు. కొంత మంది కోసం లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరించారు. ఈ నెల 1న పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి టీజీపీఎస్సీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని