రేపటి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు

అంతర్జాతీయ సరకుల (కమాడిటీస్‌) సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌-2024) జరగనుంది.

Updated : 06 Jun 2024 05:56 IST

దేశంలోనే తొలిసారి.. వేదికగా తెలంగాణ
రెండు రోజుల పాటు నిర్వహణ 
హాజరుకానున్న 30 దేశాల ప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ సరకుల (కమాడిటీస్‌) సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌-2024) జరగనుంది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థల కన్సార్షియం, భారతదేశ వరి పరిశోధన సంస్థ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని చంద్రశేఖర్‌ ఆజాద్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతదేశ వరి ఎగుమతిదారుల సమాఖ్య, ఫిక్కి తదితర సంస్థల ప్రతినిధులతో పాటు దాదాపు 30 దేశాల నుంచి వరి ఎగుమతి, దిగుమతిదారులు, భారతీయ అనుబంధ సంస్థల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శరైతులు ఇందులో పాల్గొననున్నారు. గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌కు భారత్‌లో ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను దీనికి వేదికగా ఎంచుకున్నారు. ప్రపంచంలో బియ్యం వినియోగం ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో వరిపంట ప్రాధాన్యం పెంచడంతో పాటు విస్తీర్ణాన్ని వృద్ధి చేయడం ద్వారా ఆహారభద్రత, సాగుకు సాంకేతిక సాయం, బియ్యం మార్కెటింగ్‌ను విశ్వవ్యాప్తం చేయడం, ఎగుమతుల పెంపు లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. వరిసాగులో ఎరువుల వాడకం తగ్గింపు, వాతావరణ పరిస్థితులను అధిగమించేలా సాగు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను సదస్సులో చర్చించనున్నారు. 


తెలంగాణకు ఎంతో ఉపయోగం 

ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ తొలిసారిగా ఆతిథ్యమిస్తుండగా.. ఇందుకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణం. దీన్ని సద్వినియోగం చేసుకుంటాం. వరి సాగులో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు బియ్యం దిగుమతుల కోసం భారత్‌ వైపు చూస్తున్నాయి. ఈ సదస్సు ద్వారా ఎగుమతి, దిగుమతిదారులకు ఒక వేదిక కల్పించే వీలుంటుంది. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే మన దేశం, ముఖ్యంగా తెలంగాణ రైతులకు సరైన ధరతో పాటు పెద్దమొత్తంలో ఉన్న మార్కెట్‌ నిల్వల సమస్యను పరిష్కరించుకోవచ్చు.

వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని