సంక్షిప్త వార్తలు (12)

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద 2010లో జరిగిన ఆందోళనకు సంబంధించి నమోదైన కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు బుధవారం నాందేడ్‌ జిల్లా బిలోలి సెషన్స్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు.

Updated : 06 Jun 2024 05:49 IST

బాబ్లీ కేసుపై విచారణ

బిలోలి సెషన్స్‌ కోర్టు నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేలు విజయరమణారావు, గంగుల కమలాకర్‌

సుల్తానాబాద్, న్యూస్‌టుడే: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద 2010లో జరిగిన ఆందోళనకు సంబంధించి నమోదైన కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు బుధవారం నాందేడ్‌ జిల్లా బిలోలి సెషన్స్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, గంగుల కమలాకర్, ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కోర్టుకు హాజరు కాగా వాదోపవాదాల అనంతరం జడ్జి విచారణను అక్టోబరు 17కు వాయిదా వేశారు.


అందెశ్రీని సత్కరించిన సీఎస్‌ శాంతికుమారి

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత డాక్టర్‌ అందెశ్రీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎ.శాంతికుమారి సత్కరించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన పలు పుస్తకాలను సీఎస్‌కు అందజేశారు.

ఈనాడు, హైదరాబాద్‌ 


బీఎస్సీ ఫారెస్ట్రీకి దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీ నాలుగు సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ) బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూన్‌ 6 నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అటవీ కళాశాల తెలిపింది. www.fcrihyd.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీట్లలో 75 శాతం ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయించనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు 8074350866, 9666460939 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించింది. 


గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూటీఎస్‌ నిరంతరం పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి చెప్పారు. పీఆర్‌టీయూటీఎస్‌కు అనుబంధంగా ప్రోగ్రెసివ్‌ రికగ్నయిజ్డ్‌ గురుకుల టీచర్స్‌ అసోసియేషన్‌(పీఆర్‌జీటీఏ) ఏర్పాటైన సందర్భంగా బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు, ఆరోగ్య కార్డులు మంజూరు చేయిస్తామని, అన్ని పాఠశాలల్లో కేర్‌ టేకర్లను నియమించేలా సీఎంను ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. జూన్‌లోనే అన్ని యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న గురుకుల టీచర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించేలా ముఖ్యమంత్రిని ఇప్పటికే ఒప్పించినట్టు చెప్పారు. సమావేశంలో పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.


టీజీఐసెట్ ప్రారంభం

విద్యానగర్‌ (హనుమకొండ), న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కోసం టీజీఐసెట్‌-2024 ప్రారంభమైనట్లు కన్వీనర్‌ ఆచార్య ఎస్‌.నరసింహాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మొదటి సెషన్‌కు 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 25,931 మంది హాజరయ్యారు. రెండో సెషన్‌కు 116 కేంద్రాల్లో 26,298 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. గురువారం ఉదయం మరో సెషన్‌తో ప్రవేశ పరీక్ష ముగుస్తుందని తెలిపారు.


నీట్‌ ఫలితాల్లో శ్రీ చైతన్య రికార్డు

ఫిలింనగర్, న్యూస్‌టుడే: నీట్‌ 2024 ఫలితాల్లో 720కి 720 మార్కులతో ఓపెన్‌ కేటగిరిలో 9 ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులను తమ విద్యార్థులు సాధించినట్లు శ్రీ చైతన్య విద్యాసంస్థల సీఈవో, అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. టాప్‌ ర్యాంకుల్లోనూ, టోటల్‌ ర్యాంకుల్లోనూ తమ విద్యార్థులు సత్తా చాటారని పేర్కొన్నారు. ఆలిండియా ఓపెన్‌ కేటగిరిలో 720 మార్కులతో ఒకటో ర్యాంకును వి.కల్యాణ్, పి.పవన్‌కుమార్‌రెడ్డి, ముకేశ్‌చౌదరి, భానుతేజసాయి, ఇరాన్‌ఖ్వాజీ, దర్శ్‌పగ్దార్, ఇషాకొఠారి, ఆదర్శ్‌సింగ్, అమీనాఆరిఫ్‌లు సాధించినట్లు వెల్లడించారు. 30 మంది 715 మార్కులు, ఆపైన.. 57 మంది 710 మార్కులు, ఆపైన, 127 మంది 700 మార్కులు, ఆపైన.. 852 మంది 650 మార్కులు, ఆపైన సాధించినట్లు వెల్లడించారు. విద్యార్థులను సుష్మ, శ్రీచైతన్య టెక్నో స్కూల్స్‌ డైరెక్టర్‌ సీమ బొప్పన అభినందించారు.


నారాయణ విజయ పరంపర

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ పరంపరను కొనసాగించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. 720కి 720 మార్కులతో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీల్లో 8 ఫస్ట్‌ ర్యాంకులతో తమ విద్యార్థులు రికార్డు సృష్టించారన్నారు. సామ్‌ శ్రేయాస్‌ జోసెఫ్‌ ఆలిండియా 1వ ర్యాంకు సాధించగా.. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో కె.సందీప్‌ చౌదరి, షాహ్, పి.ఆదిత్య కుమార్, శశాంక్‌ శర్మ, ఈషా కొఠారి, ప్రాచిత, దర్శ్‌ పగ్‌దార్‌లు ఫస్ట్‌ ర్యాంకు సాధించారన్నారు. 13 మంది 715 మార్కులు, 20 మంది 710 మార్కులతో రాణించారని వెల్లడించారు. విద్యార్థులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. 


శ్రీగోసలైట్స్‌ అత్యుత్తమ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ ఫలితాల్లో విజయవాడ శ్రీగోసలైట్స్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఛైర్మన్‌ నరేంద్రబాబు తెలిపారు. మొత్తం 720 మార్కులకు గాను తమ విద్యార్థులు 9 మంది 700కు పైగా మార్కులు సాధించారని వెల్లడించారు. 520 మంది విద్యార్థులు 600కు పైన మార్కులు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. 


ఎస్‌ఆర్‌ విద్యార్థుల ప్రతిభ

హనుమకొండ చౌరస్తా, న్యూస్‌టుడే : నీట్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఛైర్మన్‌ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. శ్రుతికీర్తి 662, పి.హర్షిత 652 మార్కులతో ప్రతిభ చాటారని చెప్పారు. కె.రమేశ్‌ 630, ఎం.కీర్తి 626, టి.షాలిని 621, వి.సాయిప్రసాద్‌ 621 మార్కులు సాధించారని వెల్లడించారు. మరో 105 మందికి పైగా విద్యార్థులు 500, ఆపైగా మార్కులు తెచ్చుకున్నారన్నారు. 


రెసోనెన్స్‌ విద్యార్థుల సత్తా 

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని రెసోనెన్స్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఎండీ పూర్ణచంద్రరావు తెలిపారు. తమ విద్యార్థి సిద్ధార్థ 720కి 715 మార్కులు సాధించి జాతీయస్థాయిలో సత్తా చాటారని వెల్లడించారు. మొత్తం 12 మంది 700కు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఆయా విద్యార్థులను అభినందించారు.


రాణించిన అల్ఫోర్స్‌ విద్యార్థులు 

కరీంనగర్‌ విద్యావిభాగం,న్యూస్‌టుడే : నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటినట్లు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. ఎన్‌.హేమంత్‌ 691, వి.హాసిని 671, డి.పూజిత 650, ఎన్‌.కౌశిక్‌రెడ్డి 647, పి.అక్షరరెడ్డి 639, వి.శ్రీముఖి, మరియాసభ 619, ఎ.శ్రీవర్ధిని 613, ఎన్‌.కమాలికా ప్రీతి 613, ఎన్‌.జ్ఞానద 604 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. మరో 41 మంది విద్యార్థులు 500, ఆపైన మార్కులు సాధించినట్లు వివరించారు. 


గురుకుల విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల విద్యార్థులు నీట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించారని అధికారులు తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల నుంచి 282 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని కార్యదర్శి కె.సీతా లక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నలుగురు విద్యార్థులు 720కి 600కుపైగా మార్కుల సాధించి..వారి సామాజికవర్గ కేటగిరీల్లో 490-2,435 మధ్య నాలుగు ర్యాంకులు పొందారని వెల్లడించారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలల విద్యార్థుల్లో 34 మంది ఉత్తమ ర్యాంకులు సాధించి వివిధ వైద్య కళాశాలల్లో సీట్లు పొందేందుకు అర్హత పొందారని ఆ సంస్థ కార్యదర్శి సీహెచ్‌.రమణకుమార్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు