అనర్హత పిటిషన్‌లు ఏ దశలో ఉన్నాయో చెప్పండి

పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్‌లు ఏ దశలో ఉన్నాయో తెలుసుకొని చెప్పాలంటూ అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 06 Jun 2024 05:46 IST

ఏజీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్‌లు ఏ దశలో ఉన్నాయో తెలుసుకొని చెప్పాలంటూ అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘మా పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయండి’ అని విజ్ఞప్తి చేస్తూ భారాస నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, కూనం పాండులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్‌లపై బుధవారం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌లు తీసుకోవడానికి స్పీకర్‌ కార్యాలయం నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ న్యాయవాది ద్వారా వాటిని స్పీకర్‌ కార్యాలయానికి చేర్చారు. అనంతరం వాటిపై స్పందించాలంటూ సంబంధిత ఎమ్మెల్యేలకు, స్పీకర్‌ కార్యాలయానికి, ప్రభుత్వానికి ఏప్రిల్‌ 15న హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి... స్పీకర్‌ వద్ద అనర్హత పిటిషన్‌లు ఏ దశలో ఉన్నాయో వివరణ తీసుకుని చెప్పాలంటూ అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని