రెండు దశలుగా నారాయణపేట - కొడంగల్‌ ఎత్తిపోతలు

నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీన్ని రెండు దశలుగా నిర్మించాలని నిర్ణయించింది.

Updated : 07 Jun 2024 06:19 IST

త్వరలో టెండర్లు
అంచనా వ్యయం రూ.4,350 కోట్లు
నీటి నిల్వ సామర్థ్యం 4.02 టీఎంసీలకు పెంపు

భూత్పూర్‌ జలాశయం 

ఈనాడు- హైదరాబాద్‌: నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీన్ని రెండు దశలుగా నిర్మించాలని నిర్ణయించింది. తాజా అంచనాల ప్రకారం రూ.4,350 కోట్ల వ్యయమవుతుందని అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఈ ఎత్తిపోతల అంచనా వ్యయం రూ.3,117 కోట్లు కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న రూ.2,945.50 కోట్లకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని పది చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని 0.9 టీఎంసీ నుంచి 2.1 టీఎంసీలకు పెంచాలని తొలుత నిర్ణయించారు. తాజాగా దీన్ని 4.02 టీఎంసీలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారు. దీంతోపాటు భూసేకరణ ప్రక్రియ, భూగర్భ సొరంగాల నిర్మాణానికి నాలుగైదేళ్ల సమయం పట్టే అవకాశాలుండడంతో ప్రెషర్‌ మెయిన్‌ (పైప్‌లైన్‌) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతోంది.

మార్పులు ఇలా.. 

మొదటి ప్రతిపాదన ప్రకారం ఈ ఎత్తిపోతలకు సంగంబండ జలాశయం నుంచి నీటిని తీసుకోవాలనుకున్నారు. దీన్ని ప్రభుత్వం మార్చి.. భీమా ఎత్తిపోతల్లోని భూత్పూర్‌ జలాశయం నుంచి నీరు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు నారాయణపేట, కొడంగల్‌ ప్రాంతానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఉదండాపూర్‌ జలాశయం నుంచి నీటిని తీసుకోవాలని భావించగా.. దానిలోనూ మార్పులు చేశారు. ఈ జలాశయం ద్వారా 269 అడుగుల స్థాయి కంటే 350 అడుగుల స్థాయిలో ఉన్న భూత్పూర్‌ జలాశయం నుంచి నీటిని లిఫ్ట్‌ చేయడం సులువుగా ఉంటుందని.. ఈ మేరకు మార్పులు చేసింది. మొదట అనుకున్నట్లు సొరంగాల నిర్మాణంలో 38 కిలోమీటర్ల పొడవునా బండరాళ్లను తొలగించడం క్లిష్టం కావడంతో నాలుగైదేళ్ల సమయం పడుతుందని అంచనా వేశారు. భూసేకరణకు ఇబ్బందులుండటంతో కాలువల స్థానంలో ప్రెషర్‌ మెయిన్‌ నిర్మించాలని నిర్ణయించారు. 

మొదటి దశ పనులు ఇలా.. 

ఈ ఎత్తిపోతల నిర్మాణ పనులు రెండు దశల్లో చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. మొదటి దశలో పంపుహౌసులు, ప్రెషర్‌ మెయిన్‌ నిర్మిస్తారు. దీనికి రూ.2945 కోట్లు కేటాయిస్తారు. భూత్పూర్‌ జలాశయం నుంచి ఊట్కూరు చెరువుకు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి జయమ్మ చెరువుకు, ఇక్కడి నుంచి కనుకుర్తి చెరువుకు ఎత్తిపోస్తారు. ఊట్కూరు, జయమ్మ, కనుకుర్తి చెరువుల నిల్వ సామర్థ్యం పెంచడంతోపాటు ఆధునికీకరణ పనులు చేపడతారు.

రెండో దశలో ఇలా.. 

రెండో దశలో నీటి నిల్వ సామర్థ్యం పనులు చేపడతారు. వీటికి రూ.1,404.50 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ పనుల్లో జాజాపూర్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్‌ చెరువుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతారు. గ్రావిటీ కాలువలు, ఆయకట్టుకు నీటిని అందించే పిల్ల కాలువల వ్యవస్థ నిర్మాణం చేపట్టనున్నారు. 


లక్ష ఎకరాలకు సాగునీరు

ఈ పథకంలో మక్తల్‌ నియోజకవర్గంలోని ఊట్కూరు, మక్తల్‌ మండలాల్లో 25,783 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో 20,472 ఎకరాలు, కొడంగల్‌ నియోజకవర్గంలోని కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో 53,745 ఎకరాలకు సాగునీరిస్తారు. నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు ఈ పథకం ద్వారా 0.38 టీఎంసీ తాగునీటిని అందిస్తారు. దీనికోసం అప్రోచ్‌ ఛానెళ్లు, సొరంగాలు, పంపుహౌసులు నిర్మిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని