చురుగ్గా పార్వతీ బ్యారేజీ మరమ్మతు పనులు

కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ(సుందిళ్ల) బ్యారేజీ మరమ్మతు పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

Published : 07 Jun 2024 04:34 IST

కొనసాగుతున్న సీసీ బ్లాక్‌ల లెవెలింగ్‌ పనులు

మంథని, న్యూస్‌టుడే: కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ(సుందిళ్ల) బ్యారేజీ మరమ్మతు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) ఆదేశాల మేరకు ఇటీవల ఈ పనులు చేపట్టారు. ఈ నెల 1న వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ రమణమూర్తి, ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌ రాజశేఖర్, విశ్రాంత ఎస్‌ఈ సత్యనారాయణ తదితరులతో కూడిన కమిటీ బ్యారేజీని సందర్శించింది. వారితో పాటు ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ అనిల్‌కుమార్, కాళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి పరిశీలించగా కమిటీ సిఫార్సుల ప్రకారం మరమ్మతులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలని కమిటీ సభ్యులు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో.. బ్యారేజీ దిగువ భాగంలోని సీసీ బ్లాక్‌ల లెవెలింగ్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన సిమెంట్‌ దిమ్మెలను సరి చేస్తున్నారు. బ్యారేజీకి 74 గేట్లుండగా దెబ్బతిన్న చోట సీసీ బ్లాక్‌లను సరి చేస్తున్నారు. దీంతో పాటు బ్యారేజీ లోపలి భాగంలోని 3, 4, 5 బ్లాక్‌ల వద్ద సిమెంటు గ్రేడింగ్‌ పనులు చేపట్టారు. నవయుగ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న మరమ్మతు పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 15 రోజుల్లో పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.


నేడు బ్యారేజీల సందర్శనకు మంత్రి ఉత్తమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం హెలికాప్టర్‌లో మొదట సుందిళ్లకు చేరుకుంటారు. అక్కడి నుంచి అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వద్దకు వెళ్తారు. ఆయా బ్యారేజీల వద్ద జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ చేపడుతున్న రక్షణ చర్యలు, పురోగతి గురించి ఎల్‌అండ్‌టీ, ఆఫ్‌కాన్స్, నవయుగ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్షించనున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని