నాలాల్లో మురుగు తొలగింపునకు మానవ రహిత యంత్రం

నాలాల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడానికి పారిశుద్ధ్య సిబ్బంది ఇబ్బందులు పడుతుంటారు.

Published : 07 Jun 2024 04:35 IST

తాము రూపొందించిన యంత్రంతో విద్యార్థులు 

హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నాలాల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడానికి పారిశుద్ధ్య సిబ్బంది ఇబ్బందులు పడుతుంటారు. వారి కష్టాలను తొలగించడానికి హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లోని కిట్స్‌ కళాశాల మెకానికల్‌ చివరి సంవత్సరం విద్యార్థులు కృష్ణమాధవ్, అమూల్య, సాయికృష్ణ, సల్మాన్, వివేక్‌లు బృందంగా, ఆ విభాగాధిపతి ఎం.వి.సతీష్‌కుమార్‌ మార్గదర్శకత్వంలో మానవ రహిత సోలార్‌ యంత్రాన్ని రూపొందించారు. దీనికి ‘లోకాస్ట్‌ సోలార్‌ పవర్‌ డ్రైన్‌ క్లీనింగ్‌ యంత్రం’ అని నామకరణం చేశారు. రూ.38 వేలతో రెండు వారాల్లో పరికరాన్ని తీర్చిదిద్ది గురువారం కళాశాలలో ప్రదర్శించారు. ఈ పరికరాన్ని నాలాల్లో దింపి అందులోని బ్యాటరీలను ఆన్‌ చేయగానే ఇనుప రేకుపై చైన్లకు అమర్చిన ప్లేట్లు తిరుగుతాయి. కాలువల్లో ఉన్న వ్యర్థాలను ఆ ప్లేట్లు పైకి తీసుకువచ్చి వెనుకభాగంలోని డబ్బాలో పడేస్తాయి. ఈ పరికరాన్ని ఎక్కడికైనా అవలీలగా తరలించవచ్చు. వేగాన్నీ నియంత్రించుకోవచ్చు. ఇందులోని బ్యాటరీలను సోలార్‌ ప్యానల్‌ సాయంతో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 3గంటల పాటు యంత్రం పనిచేస్తుంది’ అని రూపకర్తలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల డైరెక్టర్‌ కందుకూరి శంకర్, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఈశ్వరయ్యలు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని