గొర్రెల పంపిణీ కేసులో నిందితుడి పిటిషన్‌ కొట్టివేత

గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, తనపై కేసు కొట్టివేయాలన్న నిందితుడు సయ్యద్‌ మొహిదుద్దీన్‌ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

Published : 07 Jun 2024 04:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, తనపై కేసు కొట్టివేయాలన్న నిందితుడు సయ్యద్‌ మొహిదుద్దీన్‌ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సన్నెబోయిన ఏడుకొండలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ మొహిదుద్దీన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ కె.సుజన గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ రవాణా వ్యాపారం చేస్తుంటారని, పశుసంవర్ధక శాఖ నుంచి టెండర్లు పొంది గొర్రెలు వంటి జీవాలను లబ్ధిదారులకు చేరవేస్తుంటారన్నారు. 2021-23 మధ్య ఎలాంటి టెండర్‌ దక్కలేదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించారని.. ఈ కక్షతో అధికారులు కేసులో ఇరికించారని చెప్పారు. ఏసీబీ తరఫున సీనియర్‌ న్యాయవాది రవికిరణ్‌రావు, పోలీసుల తరఫున ఏపీపీ ఎస్‌.గణేశ్‌ వాదనలు వినిపిస్తూ అధికారులతో కుమ్మక్కై గొర్రెలను ఫిర్యాదుదారుతోపాటు మరో 16 మంది ఏపీ నుంచి తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము మాత్రం గొర్రెల యజమానులకు అందలేదన్నారు. ఇందులో కుంభకోణం ఉందని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రాథమిక ఆధారాలున్నందువల్ల కేసును కొట్టివేయలేమన్నారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని