ఎన్టీపీసీ రెండో దశ పనులకు శ్రీకారం

రాష్ట్ర విభజన చట్టంలోని నిబంధన మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు రెండో దశ పనులకు ముందడుగు పడింది.

Published : 07 Jun 2024 04:42 IST

టెండర్లకు ఆహ్వానం

ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు

న్యూస్‌టుడే, గోదావరిఖని: రాష్ట్ర విభజన చట్టంలోని నిబంధన మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు రెండో దశ పనులకు ముందడుగు పడింది. చాలాకాలంగా ఈ ప్రాజెక్టు పనులపై సందిగ్ధత నెలకొంది. మొదటి దశ పనులు పూర్తిచేసిన ఎన్టీపీసీ రెండో దశలో చేపట్టాల్సిన నిర్మాణంపై స్పష్టత ఇవ్వలేకపోయింది. దీంతో ఈ ప్రాజెక్టుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం జరగకపోవడంతో రెండో దశ నిర్మాణానికి చేపట్టాల్సిన పనులపై యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఎన్టీపీసీ సంస్థ తెలంగాణ రెండో దశ ప్రాజెక్టుతో పాటు మధ్యప్రదేశ్‌లోని గదర్‌వార్, బిహార్‌లోని నబీనగర్‌ రెండో దశ పనులకు టెండర్లు ఆహ్వానించింది. జులై 5 వరకు టెండర్లు స్వీకరించి జులై 12న తెరవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం.. ఎన్టీపీసీ సంస్థ రామగుండం ప్రాంతంలో 4,000 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్తు కేంద్రాలు నిర్మించాలి. మొదటి దశలో మొత్తం 1,600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లను నిర్మించగా ఉత్పత్తి జరుగుతోంది. రెండో దశలో 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం 800 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లను నిర్మించాల్సి ఉంది. 

అందుబాటులోనే వనరులు..

రామగుండంలో చేపట్టనున్న ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు రెండో దశ విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. మొదటి దశలో నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు, నీరు అందుబాటులోనే లభించాయి. సింగరేణి సంస్థ ద్వారా బొగ్గు సరఫరా ఒప్పందం చేసుకున్న ఎన్టీపీసీ పక్కనే ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేసుకుంటోంది. ఈ వనరులే రెండో దశకూ అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు బూడిద నిల్వ చేసేందుకు సింగరేణికి చెందిన మేడిపల్లి ఓసీపీని వినియోగించుకునేందుకు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. అయిదేళ్లలో పనులు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్న ఎన్టీపీసీ ఈ నెల 21న దిల్లీలో ప్రీ బిడ్డింగ్‌ సమావేశం నిర్వహించనుంది. లక్ష్యం మేరకు రెండో దశ పనులు పూర్తి చేసి గ్రిడ్‌కు విద్యుత్తు సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రారంభమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని