ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్చ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి వివిధ సంఘాల ప్రతినిధులు, త్రిసభ్య కమిటీ సభ్యులు గురువారం విన్నవించారు.

Published : 07 Jun 2024 04:47 IST

సీఎస్‌ శాంతికుమారికి వినతిపత్రం సమర్పిస్తున్న కోదండరాం, శ్రీనివాసరావు, జగదీశ్వర్‌ తదితరులు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి వివిధ సంఘాల ప్రతినిధులు, త్రిసభ్య కమిటీ సభ్యులు గురువారం విన్నవించారు. ఈమేరకు సీఎస్, సీఎం కార్యాలయం ప్రధాన కార్యదర్శితో చర్చించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు డాక్టర్‌ చిన్నారెడ్డి, ఆచార్య కోదండరాం, టీజీవో కేంద్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవో కేంద్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిశారు. అంతకుముందు త్రిసభ్య కమిటీ సభ్యులతో టీజీవో, టీఎన్జీవో నేతలు నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో సమావేశమై చర్చించారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ ఉంటుందని త్రిసభ్య కమిటీ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత వారంతా సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా పెండింగ్‌ డీఏల మంజూరు, ఆరోగ్య కార్డులు, 317 జీవో సమస్యలు, సీపీఎస్‌ రద్దు, ఆంధ్రలో పనిచేస్తున్న 144 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తేవడం, గచ్చిబౌలి ఇళ్ల స్థలాలు బీటీఎన్జీవో సొసైటీకి ఇప్పించడం, ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల మంజూరు, రాష్ట్ర స్థాయిలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాల ఏర్పాటు తదితరాలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అనంతరం సీఎం కార్యాలయం ప్రధాన కార్యదర్శి శేషాద్రిని కలిసి అంశాల వారీగా చర్చించారు. ఆయన సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని