సంక్షిప్త వార్తలు (12)

రాష్ట్రంలో గత ఏడాది ఆగిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పర్వతి సత్యనారాయణ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

Updated : 07 Jun 2024 06:23 IST

బదిలీలు, పదోన్నతులపై సీఎంకు వినతి

సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న పీఆర్‌టీయూ తెలంగాణ నేతలు  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత ఏడాది ఆగిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పర్వతి సత్యనారాయణ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు వారు గురువారం సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. అన్ని పాఠశాలల్లో వెంటనే స్వచ్ఛ కార్మికులను నియమించాలని, 317 జీఓ బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను మంజూరు చేయాలని విన్నవించారు. 


గోసంరక్షణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి

సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందిస్తున్న సమితి ప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గోవుల సంరక్షణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. సమితి ప్రతినిధులు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని.. తదితర అంశాలపై విజ్ఞప్తి చేశారు.


నీట్‌ ఫలితాల్లో ఆకాష్‌ విజయభేరి

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) వెల్లడించింది. 15 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేశారని.. వీరిలో ఎక్కువ మంది 679, అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని పేర్కొంది. 716 మార్కులతో అనురన్‌ ఘోష్‌ ఆలిండియా 77వ ర్యాంకు సాధించారని తెలిపింది. అసాధారణ విజయాన్ని సాధించిన విద్యార్థులను ఏఈఎస్‌ఎల్‌ చీఫ్‌ అకడమిక్, బిజినెస్‌ హెడ్‌ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా అభినందించారు. 


8న జాతీయ లోక్‌అదాలత్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా, తాలూకా కోర్టుల్లో ఈ నెల 8న లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రెటరీ సీహెచ్‌.పంచాక్షరి గురువారం వెల్లడించారు. దాంపత్య, కుటుంబ వివాదాలు, సివిల్, బ్యాంకు వివాదాలతో పాటు జరిమానా విధించిన క్రిమినల్‌ కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల్లోని పెండింగ్‌ కేసులు పరిష్కారమైతే ఫీజును తిరిగిచ్చేస్తారన్నారు. దీన్ని బ్యాంకులు, బీమా కంపెనీలతో పాటు కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు. 


రోడ్ల మరమ్మతులు నాణ్యంగా చేపట్టాలి: సీతక్క 

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను నాణ్యంగా మరమ్మతు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆమె రహదారుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... ‘‘రోడ్ల మరమ్మతులు, కొత్త వాటి నిర్మాణాలను చేపట్టాలి. పెండింగులో ఉన్న రహదారుల మరమ్మతులు, నిర్మాణంతోపాటు పంచాయతీల మౌలిక వసతులకు ప్రతిపాదనలు రూపొందించాలి. ఎక్కడైనా నాసిరకంగా పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు. 


టెస్కాబ్‌ అధ్యక్షుడిగా దేవేందర్‌రెడ్డి? 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టెస్కాబ్‌) అధ్యక్ష పదవికి మెదక్‌ డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఉపాధ్యక్ష పదవికి నిజామాబాద్‌ డీసీసీబీ ఛైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి, వరంగల్‌ డీసీసీబీ ఛైర్మన్‌ మార్నేని రవీందర్‌రావులు పోటీ పడుతున్నారు. టెస్కాబ్‌ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డిపై డైరెక్టర్లు ఇటీవల అవిశ్వాసం ప్రవేశపెట్టగా ఈనెల 10న దానిపై సమావేశం జరపాలని సహకార శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వారు తమ పదవులకు రాజీనామా చేయడంతో అదే రోజున కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవి కోసం ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీ పడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. వీరిలో సీనియర్‌గా ఉన్న దేవేందర్‌రెడ్డికి అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. రమేశ్‌రెడ్డి, రవీందర్‌రావులలో ఒకరిని ఉపాధ్యక్షునిగా ఎంపిక చేస్తారని డైరెక్టర్లు అంచనా వేస్తున్నారు.


పశు సంవర్ధక శాఖకు మరో అదనపు డైరెక్టర్‌ సుబ్బరాయుడికి అవకాశం 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు సుబ్బరాయుడికి అదనపు సంచాలకునిగా పదోన్నతి లభించింది. గురువారం సచివాలయంలో సమావేశమైన శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఈ నిర్ణయం తీసుకుంది. శాఖలో సీనియర్‌గా ఉన్న ఆయనకు పదోన్నతిలో జాప్యం జరగగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతికుమారి ఆయనకు పదోన్నతి కల్పించాలని డీపీసీని ఆదేశించారు. ప్రస్తుతం ఈ శాఖలో మూడు డైరెక్టర్‌ స్థాయి పోస్టులు ఉండగా... అదనపు డైరెక్టర్‌ మల్లేశ్వరి వీటికి ఇన్‌ఛార్జిగా ఉన్నారు. త్వరలో సుబ్బరాయుడికి ఈ పోస్టుల్లో ఒకటి లేదా రెండింటి బాధ్యతలను అప్పగించే అవకాశముందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. 


బోధనాసుపత్రుల్లో రోగులకు ‘ఆభా’ తప్పనిసరి: ఎన్‌ఎంసీ 

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని అన్ని వైద్య కళాశాలల(బోధనాసుపత్రులు)కు వచ్చే రోగుల ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య ఖాతా(ఆభా) గుర్తింపు సంఖ్యను విధిగా నమోదు చేయాలని జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ఆదేశించింది. ఎవరికైనా ఈ గుర్తింపు సంఖ్య లేకుంటే ఆధార్‌తో వెంటనే ఇవ్వొచ్చని స్పష్టంచేసింది. 2025-26 నుంచి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపు, కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, కళాశాలల రెన్యువల్‌ వంటి అంశాలన్నీ ఆసుపత్రికొచ్చే రోగుల సంఖ్యతో ముడిపడి ఉంటాయంది. అదే సమయంలో ఆభా గుర్తింపు లేదనే కారణంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యాన్ని తిరస్కరించకూడదని తెలిపింది.


టీజీఐసెట్‌కు 90.47% హాజరు 

విద్యానగర్‌ (హనుమకొండ), న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఐసెట్-2024కు 90.47 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కన్వీనర్‌ ఆచార్య ఎస్‌.నరసింహాచారి తెలిపారు. ప్రాథమిక ‘కీ’ని ఈ నెల 8న విడుదల చేస్తామన్నారు. 


8 నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తులు 

ఈనాడు, హైదరాబాద్‌: డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 8 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ పరీక్షను జులై 10న నిర్వహిస్తామని పేర్కొన్నారు.


ఎన్నికల తిరుగు బదిలీలు నిర్వహించాలి
సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌కు టీజీటీఏ, ట్రెసాల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ అయిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు పంపాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ను తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) వేర్వేరుగా కోరాయి. టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్‌ నేతృత్వంలో ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌లో సీసీఎల్‌ఏను కలిసి విన్నవించారు. అలాగే ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్‌ నేతృత్వంలో ప్రతినిధులు కలిశారు. ఎన్నికల సమయంలో జరిగిన బదిలీలకు... 2009 నుంచి తిరుగు బదిలీలు చేపడుతున్నారని గుర్తుచేశారు. ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వర్తించినందుకు రెవెన్యూ ఉద్యోగులకు సీసీఎల్‌ఏ అభినందనలు తెలియజేశారని ట్రెసా ఒక ప్రకటనలో పేర్కొంది.


నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులపై కఠిన చర్యలు సింగరేణి సీఎండీ బలరాం 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటురంగంతో పోటీపడేలా ఉద్యోగులు తమ సామర్థ్యాలను, ఆలోచనలను పెంచుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం స్పష్టం చేశారు. సంస్థల విభాగాల వారీగా పనితీరు మెరుగుపడాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన నేపథ్యంలో సంస్థ ప్రాజెక్టుల్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇకపై ప్రతినెలా సమీక్ష ఉంటుందన్నారు. సమావేశంలో అధికారులు శ్రీనివాస్, సత్యనారాయణ, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని