సంక్షిప్త వార్తలు (11)

సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ముగియడంతో పాలనాపరమైన అడ్డంకులు తొలిగాయని, ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు.

Updated : 08 Jun 2024 05:27 IST

మూడు నెలల తరువాత ప్రజావాణి పునఃప్రారంభం

అర్జీలు పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పురపాలకశాఖ సంచాలకురాలు దివ్య దేవరాజన్‌

సోమాజిగూడ, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ముగియడంతో పాలనాపరమైన అడ్డంకులు తొలిగాయని, ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో దాదాపు 3 నెలల విరామం తర్వాత ప్రజావాణి పునఃప్రారంభమైంది. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 373 అర్జీలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రజావాణి ప్రత్యేకాధికారి, పురపాలకశాఖ సంచాలకురాలు దివ్య దేవరాజన్‌ పాల్గొన్నారు.


ఎన్టీపీసీకి చేరుకున్న జస్టిస్‌ చంద్రఘోష్‌

నేడు బ్యారేజీల సందర్శన..!

గోదావరిఖని, న్యూస్‌టుడే: మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ శుక్రవారం రాత్రి పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ అతిథిగృహానికి చేరుకొని బస చేశారు. శనివారం బ్యారేజీల సందర్శనకు వెళ్లనున్నట్లు సమాచారం. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ ఆయనకు స్వాగతం పలికారు.  


24 నుంచి నిరసన కార్యక్రమాలు: టీఎంఎస్‌టీఏ

ఈనాడు, హైదరాబాద్‌: ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌(టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు తెలిపారు. శుక్రవారం మోడల్‌ స్కూల్స్‌ అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారికి ఆయన నిరసన నోటీస్‌ను అందజేశారు. ఈ నెల 23వ తేదీలోపు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని లేకుంటే నిరసన కార్యక్రమాలు చేస్తామని ఆయన నోటీసులో పేర్కొన్నారు. 


కాళోజీ కొత్త వీసీ నియామక ప్రక్రియకు శ్రీకారం

దరఖాస్తులను ఆహ్వానించిన వైద్య ఆరోగ్యశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ కొత్త వైస్‌ఛాన్సలర్‌ నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ శుక్రవారం ప్రకటన జారీ చేసింది. దాని ప్రకారం... వైద్య, ఆరోగ్య రంగంలో నిష్ణాతులు, వైద్య కళాశాలల్లో డీన్‌ లేదా ప్రిన్సిపాళ్లుగా పని చేసిన వారు ఈ నెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి. వైద్య కళాశాలలో డీన్‌గా రెండేళ్లు లేదా ప్రిన్సిపల్‌గా పదేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి 67 ఏళ్లు. 2015 నవంబరులో నియమితులైన బి.కరుణాకర్‌రెడ్డి ప్రస్తుతం వైస్‌ ఛాన్సలర్‌గా ఉన్నారు. రెండు పర్యాయాలు.. అంటే ఆరు సంవత్సరాలే పదవిలో ఉండే అవకాశమున్నా గత ప్రభుత్వం ఆయన్ను కొనసాగిస్తూ వచ్చింది. ఈ అంశం వైద్య,ఆరోగ్యశాఖలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త వీసీ నియామక ప్రక్రియను ప్రారంభించింది. అలాగే ప్రజారోగ్యశాఖ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ)గా ఇన్‌ఛార్జుల స్థానంలో రెగ్యులర్‌ అధికారులను నియమించేందుకు సీనియారిటీ అంశాన్ని వైద్య,ఆరోగ్యశాఖ కొలిక్కి తెస్తోంది.


అందోలుకు నర్సింగ్‌ కళాశాల మంజూరు

రూ.43 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల కొత్తగా ఏర్పాటు కానుంది. సంగారెడ్డి జిల్లాలోని అందోలుకు నర్సింగ్‌ కాలేజీని మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 60 సీట్ల సామర్థ్యంతో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.43 కోట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాల ఏర్పాటుకోసం జాతీయ నర్సింగ్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోవడానికి, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధం కాలేజీగా ఏర్పాటుకు వీలుగా వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ)కి అనుమతిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న దామోదర్‌ రాజనర్సింహ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


బీఎస్సీ బయోమెడికల్‌ సైన్స్‌ కోర్సుకు శ్రీకారం

ఈ ఏడాది నుంచే నాలుగేళ్ల ఆనర్స్‌గా అందుబాటులోకి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలిసారిగా బీఎస్సీ బయో మెడికల్‌ కోర్సును రాష్ట్ర ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తెచ్చింది. నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సుగా దీన్ని రూపొందించారు. ఇప్పటివరకు కేవలం ఇంజినీరింగ్‌లో మాత్రమే బయో మెడికల్‌ కోర్సు ఉండేది. ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. పరిశ్రమల నిపుణులు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు కలిసి సిలబస్‌ రూపొందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ప్రముఖ లేబొరేటరీస్, ఫార్మా కంపెనీల ప్రతినిధులు, ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్, మహావీర్‌ ఆసుపత్రి సీనియర్‌ వైద్యులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమై చర్చించారు. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు ఆయా కార్పొరేట్‌ ఆసుపత్రులు, బయో ఫార్మా పరిశ్రమలతోపాటు డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో శిక్షణ పొందేందుకు డిగ్రీ కళాశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. కొన్ని కళాశాలలకు దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దోస్త్‌ పరిధిలో లేని కళాశాలలు సొంతగా ప్రవేశాలు నిర్వహించుకుంటాయి. 


బీసీ గురుకుల కళాశాలల ప్రవేశాల రెండోవిడత జాబితా వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల రెండో విడత జాబితాను బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు విడుదల చేశారు. మొత్తం 21,920 సీట్లు అందుబాటులో ఉంటే... తొలివిడతలో 18,749 మందికి 10,562 మంది ప్రవేశాలు పొందారన్నారు. రెండో విడత జాబితాను వెబ్‌సైట్లో పొందుపరిచామని, విద్యార్థులు వారికి కేటాయించిన కళాశాలల్లో ఈనెల 14లోగా రిపోర్టు చేయాలని సూచించారు.  


అంగన్‌వాడీ సిబ్బందికి పదవీ విరమణ ప్రోత్సాహకాలు పెంచాలి

- యూనియన్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదవీ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లకు ప్రోత్సాహకాలను పెంచాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షురాలు నల్లా భారతి, ఉపాధ్యక్షురాలు ఎం.అరుణ, కోశాధికారి వేదవతి తదితరులు మహిళాశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ కాంతి వెస్లీని కలిసి వినతిపత్రం అందజేశారు. 1975లో ఐసీడీఎస్‌ ప్రారంభమైన తరువాత సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, వర్కర్లకు రూ.50 వేలు ఇవ్వడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. చాలీచాలని వేతనాలతో సేవలందించి వృద్ధాప్యంలో చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో పదవీ విరమణ ప్రోత్సాహకాలు పెంచాలని కోరారు. వేతనంలో కనీసం సగం పెన్షన్‌ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్ని పూర్వ ప్రాథమిక కేంద్రాలుగా మార్చడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. 


మత్స్యకారుల సమాఖ్య ఛైర్మన్‌ నియామకంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికలు నిర్వహించకుండా మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్‌ను నియమించడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముత్రాసి, ముదిరాజ్‌ తెనుగు సొసైటీలు ఇచ్చిన వినతి పత్రంపై ఏ నిర్ణయం తీసుకున్నారో వివరాలు సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న తమ వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా బెస్త వర్గానికి చెందిన వ్యక్తిని నామినేట్‌ చేయడంపై తాము చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హనుమకొండకు చెందిన బుస్సా మల్లేశం మరో 8 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డి.ఎల్‌.పాండు వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు.


10న వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆరో స్నాతకోత్సవం ఈ నెల పదో తేదీన రాజేంద్రనగర్‌లోని ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు జరగనుంది. విశ్వవిద్యాలయ కులపతి, గవర్నర్‌ రాధాకృష్ణన్‌ అధ్యక్షతన జరిగే స్నాతకోత్సవానికి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు శెట్టి ముఖ్యఅతిథిగా హాజరవుతారని వీసీ రఘునందన్‌రావు తెలిపారు.

కలుపు యాజమాన్యంపై సదస్సు

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిలభారత కలుపు నివారణ విభాగం మూడు రోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. సదస్సులో మొక్కజొన్న శాస్త్రవేత్త ఆర్‌కే మాలిక్, పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డి, తెలంగాణ దక్షిణ మండల డైరెక్టర్‌ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటలలో కలుపు యాజమాన్య పద్ధతులు, పరిశోధనలను వివరించారు. 


సన్నజాజి మొక్క.. 18 మీటర్లు పెరిగింది ఎంచక్కా!

కరీంనగర్‌ నగరం ముకరంపురలోని ఓ భవనంపైకి ఎగబాకిన సన్నజాజి పూల తీగ మొక్కను అపార్ట్‌మెంటువాసులు 15 ఏళ్ల క్రితం నాటారు. భవనానికి జరిగిన చిన్నచిన్న మరమ్మతులు, పెయింట్‌ వేసిన సందర్భాల్లోనూ అపార్ట్‌మెంటువాసులు దీని కొమ్మలు తొలగించకుండా అపురూపంగా పెంచారు. దీంతో సుమారు 18 మీటర్ల మేరకు పెరిగిన ఈ మొక్క నగరవాసులను ఆకర్షిస్తోంది. ఒలియేసి కుటుంబానికి చెందిన ఈ రకం సన్నజాతి జాజి మొక్కకు పొడవు పెరిగే లక్షణం ఉంటుందని శాతవాహన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎలగొండ నరసింహమూర్తి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

 న్యూస్‌టుడే, కరీంనగర్, కరీంనగర్‌ సాంస్కృతికం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని