మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు నోటీసు ఇచ్చి విచారించండి

బియ్యం అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కోటగిరి, వర్ని పోలీసుస్టేషన్‌లలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌పై నమోదైన కేసుల్లో నిబంధనల ప్రకారం దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 08 Jun 2024 05:23 IST

పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: బియ్యం అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కోటగిరి, వర్ని పోలీసుస్టేషన్‌లలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌పై నమోదైన కేసుల్లో నిబంధనల ప్రకారం దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుటుంబానికి చెందిన మిల్లులకు పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన ధాన్యం మాయంపై ఇటీవల వర్ని, కోటగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌లోని షకీల్‌కు చెందిన మూడు మిల్లుల్లో పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 50,732 టన్నుల ధాన్యాన్ని సరఫరా చేయగా 33 వేల టన్నులకు పైగా దుర్వినియోగమైనట్లు సోదాల్లో తేలింది. రూ.70 కోట్ల విలువైన బియ్యం కనిపించకపోవడంపై అధికారుల ఫిర్యాదుతో రెండు ఠాణాల్లో కేసు నమోదు చేశారు. ఆ కేసుల్లో నిందితుడిగా చేర్చి పోలీసులు దర్యాప్తు పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని షకీల్‌ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది కేవలం బియ్యం కనిపించలేదన్న కేసు మాత్రమే కాదన్నారు. బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలించారన్నారు. ఈ కుట్రకు చెందిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఈ దశలో వాటిని వెల్లడించలేమని, కోర్టుకు అందజేస్తామని, గడువు కావాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 21కు వాయిదా వేశారు. ఈ కేసుల దర్యాప్తులో సీఆర్‌పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని