గ్రూప్‌-1 పరీక్షలో జోక్యం చేసుకోలేం

రాష్ట్రంలో ఈ నెల 9న జరగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణలో జోక్యం చేసుకోలేమంటూ శుక్రవారం హైకోర్టు తేల్చి చెప్పింది.

Published : 08 Jun 2024 05:28 IST

అప్పీలును తిరస్కరించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 9న జరగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణలో జోక్యం చేసుకోలేమంటూ శుక్రవారం హైకోర్టు తేల్చి చెప్పింది. అన్ని ఏర్పాట్లు పూర్తయి ఆదివారం పరీక్ష జరగనున్న నేపథ్యంలో వాయిదా వేయలేమని పేర్కొంది. కేవలం కొందరి కోసం ఎక్కువ మంది ప్రయోజనాలు దెబ్బతినేలా ఉత్తర్వులు జారీ చేయలేమంది. పరీక్షల వాయిదాకు సింగిల్‌ జడ్జి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అప్పీలును హైకోర్టు కొట్టివేసింది. జూన్‌ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ పరీక్ష ఉన్నందున గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేసేలా ఆదేశించాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం.గణేశ్, హనుమకొండకు చెందిన భూక్యా భరత్‌లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారించిన సింగిల్‌ జడ్జి పిటిషన్‌ కొట్టివేశారు. దీంతో ఎం.గణేశ్, భరత్‌లు అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతున్నందున ఒక దానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. పరీక్షను వాయిదా వేస్తే నిరుద్యోగులకు ఊరట లభిస్తుందన్నారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు 4.30 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ దశలో వాయిదా వేస్తే లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతారన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం పరీక్షను వాయిదా వేయడానికి నిరాకరిస్తూ అప్పీలును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని