రెవెన్యూ చట్టంలో మార్పులు!

రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే రెవెన్యూ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ధరణి కమిటీ భావిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో ధరణి కమిటీ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది.

Published : 08 Jun 2024 05:36 IST

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కసరత్తు
త్వరలో ప్రభుత్వానికి ధరణి కమిటీ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే రెవెన్యూ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ధరణి కమిటీ భావిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో ధరణి కమిటీ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. ప్రస్తుతం ఉన్న చట్టాలతో అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం కష్టమేనన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో నిర్వహించిన సమావేశాల్లో క్షేత్ర స్థాయి సమస్యలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో అమల్లో ఉన్న రెవెన్యూ చట్టం-2020లో పలు లోపాలున్నాయి. ధరణి పోర్టల్‌కు సంబంధించి ఏ మార్పు చేయాలన్నా నిబంధనలు అడ్డొస్తున్నాయి. 2020కి ముందున్న ఆర్‌ఓఆర్‌ (భూ యాజమాన్య హక్కుల చట్టం)కి మార్పులు చేసిన గత ప్రభుత్వం... తెలంగాణ పట్టా పాసు పుస్తకాలు, దస్త్రాల నిర్వహణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారమే ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చింది. దీనిప్రకారం దస్త్రాల్లో మార్పులు చేర్పులు, ఫిర్యాదులకు ఎక్కడా అవకాశం లేదు. తహసీల్దారు నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ వరకు ఎవరూ ఏ సమస్యా పరిష్కరించడానికి వీలులేకుండా ఉంది. దీంతో భూ వివాదాలపై రైతులు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటున్నా పరిష్కారాలు సాధ్యం కావడం లేదు. ఈ విషయాన్ని ధరణి కమిటీ అధ్యయనంలోనూ గుర్తించింది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన మార్పులకు సంబంధించి కమిటీ ఒక నివేదికను రూపొందించినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. రెవెన్యూ చట్టంలో మార్పులు చేయాలంటే మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ చట్టంలో మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని