వర్షాలపై మరింత అప్రమత్తత అవసరం!

భారీ వర్షాలు కురిస్తే ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరిన్ని వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

Published : 08 Jun 2024 05:37 IST

డిజాస్టర్‌ రెస్పాన్స్‌ పటిష్ఠానికి చర్యలు
ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాలు కురిస్తే ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరిన్ని వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, పోలీసు, జలమండలి, విద్యుత్తు, అగ్నిమాపక, వాతావరణ శాఖల అధికారులతో సచివాలయంలో శుక్రవారం ఆమె ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘గ్రేటర్‌ పరిధిలోని డిజాస్టర్‌ రెస్పాన్స్‌ విభాగాన్ని మరింత పటిష్ఠం చేయాలి. గతంలో కుండపోతగా వర్షం కురిసిన ప్రాంతాలను ఎల్లో, అతి భారీగా కురిసిన ప్రాంతాలను ఆరెంజ్, భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలను రెడ్‌ కేటగిరీలుగా విభజించి ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. వాతావరణ శాఖ జారీ చేసే సూచనలను అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు పౌర సమాజానికి చేరవేయాలి. హైదరాబాద్‌ నగరంలో 134 ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఎక్కువ సమయం వర్షపు నీరు రహదారులపై నిలుస్తున్నాయి. దీనిపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, జలమండలి, పోలీసు, ఎస్పీడీసీఎల్‌ అధికారులు ఒక కమిటీగా ఏర్పడి ప్రణాళికలు రూపొందించాలి’ అని స్పష్టం చేశారు. ‘వర్షపు నీటిని నిల్వ చేసేందుకు హైదరాబాద్‌లో మూడు భారీ సంపులు నిర్మాణంలో ఉన్నాయి. 630 ప్రత్యేక సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం’ అని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ తెలిపారు. సమావేశంలో డీజీపీ రవీగుప్తా, హోంశాఖ కార్యదర్శి జితేందర్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, గ్రేటర్‌ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్, జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని