112 నుంచి 80.5 టీఎంసీలకు

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామసాగర్‌ జలాశయం నీటినిల్వ సామర్థ్యం నిర్మాణ సమయం నుంచి ఇప్పటి వరకు 31.5 టీఎంసీలు తగ్గింది.

Published : 08 Jun 2024 05:38 IST

పూడికతో శ్రీరామసాగర్‌లో భారీగా తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం
చెన్నై సంస్థ సర్వేలో వెల్లడి 

శ్రీరామసాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 

శ్రీరామసాగర్, న్యూస్‌టుడే: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామసాగర్‌ జలాశయం నీటినిల్వ సామర్థ్యం నిర్మాణ సమయం నుంచి ఇప్పటి వరకు 31.5 టీఎంసీలు తగ్గింది. చెన్నైకి చెందిన సంస్థ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. 18 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌ వద్ద గోదావరిపై 1963 జులైలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1980 ప్రాంతం నుంచి కాల్వల ద్వారా నీరు అందిస్తున్నారు. ప్రారంభంలో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు కాగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం, గోదావరి పరీవాహక ప్రాంతం నల్లరేగడి భూమి ఉండడంతో ఏటా పెద్దఎత్తున పూడిక వచ్చి పేరుకుపోతోంది. ప్రాజెక్టులో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతుండగా ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మొదటిసారిగా 1994లో పూడిక సర్వే చేయించారు. అప్పట్లోనే 21.687 టీఎంసీల నీటి నిల్వ చేసే మేర పూడిక చేరిందని తేల్చారు. దీంతో జలాశయం సామర్థ్యం 90.313 టీఎంసీలకు తగ్గించి లెక్కిస్తున్నారు. మరోసారి నిల్వ సామర్థ్యం పైఅధికారులకు అనుమానం రాగా 2022లో చెన్నైకి చెందిన సీకామ్‌ కంపెనీతో పూడిక సర్వే చేయించారు. ఈ నివేదిక మే చివరి వారంలో వెలువడింది. దీని ప్రకారం.. 1994 నుంచి 2022 వరకు 9.813 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం పడిపోయింది. జూన్‌ 1 నుంచి ప్రాజెక్టులో 80.5 టీఎంసీల నీటినిల్వగా లెక్కిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 6.30 టీఎంసీల నీరుంది. పాత గణాంకాల ప్రకారం డెడ్‌ స్టోరేజీ 5 టీఎంసీలు కాగా.. ఇప్పడు ఎంత అనేది అధికారులు వెలువరించలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని