వీఆర్వోలను రెవెన్యూలోకి తీసుకోండి

గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)ను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తిచేసింది.

Published : 08 Jun 2024 05:41 IST

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ట్రెసా వినతి

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమస్యలు వివరిస్తున్న ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రతినిధి బృందం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)ను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తిచేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కె.నిరంజన్‌రావు, వీఆర్వోల ఐకాస అధ్యక్షుడు గోల్కొండ సతీష్‌ కలిసి పలు సమస్యలను వివరించారు. ‘ప్రస్తుతం క్షేత్రస్థాయి విధులకు సిబ్బంది అవసరం ఎంతో ఉంది.  ఇటీవలి ఎన్నికల్లో వీఆర్వోలు, వీఆర్‌ఏలు లేక నిర్వహణ పరంగా అనేక ఇబ్బందులు తలెత్తాయి. వీఆర్వోలను తిరిగి తీసుకోవడం ద్వారా శాఖ బలోపేతమవుతుంది. వారికి కారుణ్య నియామకాలు, సొంత జిల్లాలకు బదిలీ, శాఖలో చేరేందుకు ఐచ్ఛికాలు కల్పించాలి. ఎన్నికల సందర్భంగా బదిలీచేసిన తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దార్ల తిరుగు బదిలీలు చేపట్టాలి’ అని వారు కోరారు. మంత్రి స్పందిస్తూ త్వరలోనే తిరుగు బదిలీలు పూర్తి చేస్తామని, వీఆర్‌ఏ, వీఆర్వోల సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని