ఐటీ పరిశ్రమకు కార్మిక చట్ట మినహాయింపులు

ఐటీ పరిశ్రమలో రాత్రివేళ విధుల్లో మహిళా ఉద్యోగులు పనిచేసేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. వారికి అవసరమైన భద్రత, ఇంటి నుంచి రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించింది.

Updated : 08 Jun 2024 06:02 IST

నాలుగేళ్లు అమలయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ పరిశ్రమలో రాత్రివేళ విధుల్లో మహిళా ఉద్యోగులు పనిచేసేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. వారికి అవసరమైన భద్రత, ఇంటి నుంచి రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల చిరునామా, మొబైల్‌ నంబర్లను అనధికార వ్యక్తులతో పంచుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని షరతులకు లోబడి రాష్ట్రంలోని ఐటీ ఆధారిత పరిశ్రమలకు తెలంగాణ దుకాణాలు, సముదాయాల చట్టంలోని సెక్షన్లు 15, 16, 21, 23, 31 నుంచి నాలుగేళ్లపాటు మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశిత నిబంధనలను అతిక్రమిస్తే కార్మికచట్టం కింద ఇచ్చిన మినహాయింపులు రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం 2024 మే 30 నుంచి అమల్లోకి వస్తుందని కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇవీ నిబంధనలు..

  • ఉద్యోగులను రాత్రివేళ విధులకు తీసుకువచ్చేటప్పుడు, విధుల అనంతరం తిరిగి డ్రాప్‌ చేసేటప్పుడు తొలుత వాహనం ఎక్కేవారు, ఆఖరున దిగేవారిలో మహిళలు లేకుండా రూట్లు సిద్ధం చేయాలి.
  • ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు వారానికి 48 గంటలు పనిచేయాలి. అంతకుమించి పనిచేస్తే వారికి ఓవర్‌టైమ్‌ వేతనాలు చెల్లించాలి.
  • ప్రతి ఉద్యోగికీ వారాంతపు సెలవు ఇవ్వాలి. ఉద్యోగులందరికీ ఐడీ కార్డులతో పాటు సంక్షేమ చర్యలు చేపట్టాలి. సెలవు రోజుల్లో పనిచేస్తే వారికి ప్రత్యామ్నాయ సెలవు ఇవ్వాలి.
  • వాహన డ్రైవర్ల పూర్తి సమాచారం కంపెనీల వద్ద ఉండాలి. వారిని ఉద్యోగంలో చేర్చుకునే ముందు తప్పనిసరిగా పూర్వ తనిఖీ చేయాలి.
  • ప్రతి సోమవారం ఆ వారంలో తిరగాల్సిన ట్రిప్పులు, రూట్లు, డ్రైవర్ల కేటాయింపు సూపర్‌వైజర్‌ నిర్ణయిస్తారు. ఉద్యోగులకు సమాచారం లేకుండా సూపర్‌వైజర్‌ ఆ ట్రిప్పులు, డ్రైవర్లు, షిప్టులను మార్చడానికి వీల్లేదు.
  •  రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మహిళా ఉద్యోగుల పికప్, డ్రాప్‌ ఉంటే తప్పనిసరిగా భద్రతా సిబ్బంది వెంట ఉండాలి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని