సంక్షిప్త వార్తలు (5)

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో 22వ గేటును పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్‌ అధికారులు శనివారం పైకెత్తారు.

Updated : 09 Jun 2024 07:22 IST

మేడిగడ్డ బ్యారేజీలో మరో గేటు ఎత్తివేత

ఏడో బ్లాక్‌లో పైకెత్తిన 22వ గేటు 

మహదేవపూర్, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో 22వ గేటును పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్‌ అధికారులు శనివారం పైకెత్తారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో.. గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తాలని, ఏదైనా సమస్య ఎదురైతే తొలగించాలని సూచించింది. ఈ మేరకు ఏడో బ్లాక్‌లో ఒక్కో గేటును పైకి ఎత్తుతున్నారు. గత నెల 17న 15వ గేటు, ఈ నెల 6న 16, 17వ గేట్లను పైకెత్తారు. శనివారం 22వ గేటును పూర్తి స్థాయిలో పైకి ఎత్తారు. 20వ గేటు కటింగ్‌ పనులు జరుగుతున్నాయి. మొత్తంగా ఏడో బ్లాక్‌లో సమస్య ఉన్న 18, 19, 20, 21 గేట్లను తొలగించాల్సి ఉంది.


భరోసా సొసైటీకి వియాట్రిస్‌ సంస్థ విరాళం

తొలివిడతగా రూ.1.5కోట్ల చెక్కు అందజేత

అదనపు డీజీపీ శిఖాగోయెల్‌కు చెక్కు అందజేస్తున్న వియాట్రిస్‌ సంస్థ ప్రతినిధి మిచల్‌ డోమినికా 

ఈనాడు, హైదరాబాద్‌: మహిళా బాధితుల సహాయక కేంద్రమైన భరోసా సొసైటీ భవన నిర్మాణానికి వియాట్రిస్‌ సంస్థ భారీ విరాళం ప్రకటించింది. తెలంగాణ డీజీపీ రవిగుప్తా, వియాట్రిస్‌ సంస్థ భారత సీఎస్‌ఆర్‌(కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) ఇన్‌ఛార్జి మిచల్‌ డోమినికా, తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ శిఖాగోయెల్‌ సమక్షంలో భరోసా సొసైటీ మౌలిక సదుపాయాల పరిధిని విస్తరించేందుకు ఒప్పందంపై హైదరాబాద్‌లో శనివారం సంతకాలు చేశారు. ఈ క్రమంలో తొలివిడతగా వియాట్రిస్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ కింద రూ.కోటిన్నర విరాళానికి సంబంధించిన చెక్కును శిఖాగోయెల్‌కు డోమినికా అందజేశారు. రెండో విడతలో మరో రూ.కోటి అందించనున్నట్లు ప్రకటించారు. 


బోధనాసుపత్రుల వైద్యులకు న్యాయం చేయండి

హైదరాబాద్‌ కోఠి డీఎంహెచ్‌ఎస్‌ ఆవరణలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రభుత్వ బోధనాసుపత్రుల వైద్యులు

సుల్తాన్‌బజార్, న్యూస్‌టుడే: వైద్య సంఘాల ప్రమేయం, పైరవీలకు తావులేకుండా సాధారణ బదిలీలను పారదర్శకంగా నిర్వహించి జిల్లాల్లోని బోధనాసుపత్రుల వైద్యులకు న్యాయం చేయాలని రాష్ట్ర వైద్య విద్య కళాశాలలు, బోధనాసుపత్రుల వైద్యుల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. బోధనాసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యులు శనివారం ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కోఠి డీఎంహెచ్‌ఎస్‌ ఆవరణలో సమావేశమయ్యారు. ఏళ్ల తరబడిగా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధి డా.వి.శేఖర్‌ మాట్లాడుతూ.. సంఘాలను అడ్డుపెట్టుకుని కొందరు వైద్యులు ఏళ్ల తరబడిగా ఉస్మానియా, గాంధీ, కాకతీయ, నిజామాబాద్‌ వంటి ప్రధాన కేంద్రాల్లోని బోధనాసుపత్రుల్లో తిష్ఠ వేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా.మనీష్‌గుప్తా, డా.బెంజమిన్, డా.బాబూరావు, డా.నాగరాజు, డా.చంద్రశేఖర్, డా.సాంబశివరెడ్డి, డా.మాధవ్, డా.జితేంద్ర, డా.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


ఆర్థిక శాఖ పరిధిలోకి రాష్ట్ర ఆర్థిక సంఘం 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని(స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ను) పంచాయతీరాజ్‌ శాఖ నుంచి ఆర్థికశాఖకు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో ఏర్పాటైన రాష్ట్ర ఆర్థిక సంఘం ఇన్ని రోజులు పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఉంది. గొడిశాల రాజేశంగౌడ్‌ అధ్యక్షతన ఏర్పాటైన మొదటి ఆర్థిక సంఘం తమ సిఫార్సుల్లో తమ సంస్థను ఆర్థికశాఖ పరిధిలోకి మార్చాలని సిఫార్సు చేసింది. దీనిని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.


గ్రూప్‌-1 అభ్యర్థులకు  ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యం కోసం ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ శనివారం ప్రకటించింది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది విద్యార్థులు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు హాజరవుతుండగా అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నారు. వీరికీ సిటీ బస్సులను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని