సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం పెద్దపీట

రాష్ట్రంలో పరిశ్రమలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీల దరఖాస్తులను టీజీఐఐసీ ఎప్పటికప్పుడు పరిశీలించి భూకేటాయింపులు చేస్తుంది.

Published : 09 Jun 2024 04:23 IST

70 శాతం భూకేటాయింపులు వాటికే

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిశ్రమలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీల దరఖాస్తులను టీజీఐఐసీ ఎప్పటికప్పుడు పరిశీలించి భూకేటాయింపులు చేస్తుంది. గత మూడు నెలలుగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో టీజీఐఐసీకి 140కి పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన టీజీఐఐసీ.. 113 కంపెనీలు భూకేటాయింపులకు అర్హమైనవిగా గుర్తించింది. ఎన్నికల కోడ్‌ ఎత్తివేసిన వెంటనే వీటికి భూములను కేటాయించింది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.2,200 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు.. దాదాపు 7,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం గుర్తించింది. భూమిని కేటాయించిన వాటిలో ఫ్రాన్స్‌కు చెందిన మానే, హాంకాంగ్‌కు చెందిన ఏపీసీ, మలబార్‌ గోల్డ్‌ వంటి గుర్తింపు పొందిన సంస్థలున్నాయి. ఈ భూ కేటాయింపుల్లో అగ్రభాగం(దాదాపు 70%) సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈలకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘టీజీఐఐసీ స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూత ఇవ్వడానికి; దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరిన్ని ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌లను ఏర్పాటు చేయబోతోంది. 2023 డిసెంబరులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రూ.50,000 కోట్ల కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు ప్రకటించాం. ఈ ప్రాజెక్టులన్నింటినీ ఏర్పాటు చేయడానికి, భూమిని కేటాయించడానికి టీజీఐఐసీ ఈ కంపెనీలతో స్నేహపూర్వకంగా కలిసి పనిచేస్తోంది’’ అని పరిశ్రమల శాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని