దామగుండం వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌ చుట్టూ 27 కి.మీ. రహదారి నిర్మాణం

వికారాబాద్‌ జిల్లా దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2,901 ఎకరాల అటవీ భూమిని నౌకాదళం అధీనంలోకి తీసుకుంది.

Published : 09 Jun 2024 04:30 IST

కీలకం కానున్న వన్యప్రాణుల సంరక్షణ

వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌కు ఇచ్చిన దామగుండం ప్రాంత సరిహద్దులను గుర్తిస్తున్న అటవీ సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2,901 ఎకరాల అటవీ భూమిని నౌకాదళం అధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతం చుట్టూ సరిహద్దులు ఏర్పాటుచేసే ప్రక్రియను ప్రారంభించింది. దీని పరిధిలో దేశంలోనే రెండో వీఎల్‌ఎఫ్‌ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ను పూడూరు మండలంలో ఏర్పాటు చేయనున్నారు. 2027 చివరి నాటికి దీన్ని నిర్మించాలన్నది లక్ష్యం. వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌ కోసం తీసుకున్న అటవీభూముల చుట్టూ ఔటర్‌ తరహాలో 27 కి.మీ. మేర నౌకాదళం నూతన రహదారిని నిర్మించనున్నట్లు సమాచారం. దామగుండం రిజర్వ్‌ ఫారెస్టు మధ్యలోంచి ప్రస్తుతం రహదారి ఉంది. వికారాబాద్‌ నుంచి పూడూరు, పరిగి రోడ్డును కలిసే దీనిగుండా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌ నిర్మాణం నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా రాకపోకల విషయంలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. అనంతగిరి హిల్స్‌ రిజర్వ్‌ ఫారెస్టు తర్వాత దామగుండం రక్షిత అటవీప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతంలో భారీసంఖ్యలో వన్యప్రాణులున్నాయి. 700 వరకు జింకలు ఉన్నట్లు అటవీశాఖ అంచనా. వీటితో పాటు అడవి పందులు, కుందేళ్లు వంటివి ఉన్నాయి. ఇన్నాళ్లూ అటవీశాఖ సంరక్షణలో ఉన్న ప్రాంతం ఇప్పుడు నౌకాదళం అధీనంలోకి వెళ్లింది. దీంతో వన్యప్రాణుల సంరక్షణ విషయం కీలకంగా మారింది.


దూరం కొంత పెరుగుతుంది

- జ్ఞానేశ్వర్, వికారాబాద్‌ డీఎఫ్‌వో

దామగుండం రక్షిత అటవీప్రాంతం మధ్యలోంచి ప్రస్తుతం ఉన్న రహదారి మార్గాన్ని మూసివేసి నౌకాదళం తమ అంతర్గత అవసరాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ మార్గంలో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నవారికి ఇబ్బంది లేకుండా దామగుండం రిజర్వ్‌ ఫారెస్టు చుట్టూ నూతన రోడ్డును నిర్మిస్తుంది. దీంతో కొంత దూరం పెరుగుతుంది. 2,901 ఎకరాలకు గాను 1,500 ఎకరాలు దట్టమైన అటవీప్రాంతం. నౌకాదళం ఆ భూమిని అలాగే ఉంచుతుంది. 900 ఎకరాల్లోనే వీఎల్‌ఎఫ్‌ స్టేషన్, మౌలిక వసతుల్ని నిర్మిస్తారు. మిగిలిన 500 ఎకరాలు గడ్డి భూములుగా ఉంటాయి. ఇక్కడ కావాల్సినంత గడ్డి ఉండటంతో జింకలకు సరిపడా ఆహారం దొరుకుతుంది. వన్యప్రాణుల సంరక్షణ నౌకాదళం ద్వారా చేయిస్తాం. లేదంటే అటవీశాఖ ద్వారా వాటి సంరక్షణ చర్యలు చూస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని