రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి శిబిరాలు

అటవీప్రాంతంలో సాయం సంధ్యా సమయంలో సేదతీరుతూ.. చీకటిపడ్డాక చేతిలో లాంతర్లు పట్టుకుని ట్రెక్కింగ్‌ చేస్తే ఆ అనుభూతే వేరు. క్యాంప్‌ ఫైర్‌ చుట్టూ కూర్చుని అందరితో కలిసి ఆడుతూపాడుతూ ఉంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు.

Published : 09 Jun 2024 06:13 IST

అటవీప్రాంతంలో నేచర్‌ క్యాంప్‌ 
పర్యావరణ ప్రేమికులు సేద తీరేలా ఏర్పాట్లు 
చిలుకూరు ట్రెక్‌ పార్కుకు మంచి స్పందన 
త్వరలో వికారాబాద్, ఖమ్మం అటవీప్రాంతాల్లో ప్రారంభం

ట్రెక్కింగ్‌ చేస్తున్న విద్యార్థులు 

ఈనాడు, హైదరాబాద్‌: అటవీప్రాంతంలో సాయం సంధ్యా సమయంలో సేదతీరుతూ.. చీకటిపడ్డాక చేతిలో లాంతర్లు పట్టుకుని ట్రెక్కింగ్‌ చేస్తే ఆ అనుభూతే వేరు. క్యాంప్‌ ఫైర్‌ చుట్టూ కూర్చుని అందరితో కలిసి ఆడుతూపాడుతూ ఉంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు. అక్కడే భోజనం చేసి.. ఓ టెంట్‌ వేసుకుని అందులో నిద్రిస్తే ఆ అనుభవం మరువలేనిది. ఉదయమే నిద్రలేచి ‘బర్డ్‌ వాక్‌’లో రకరకాల పక్షుల్ని తిలకిస్తే.. ఆ పులకింత వర్ణనాతీతం. ఈ అనుభవాలకు నిలయమైంది.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరులోని ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌. ఇందులో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘నేచర్‌ క్యాంప్‌’నకు మంచి స్పందన వస్తోంది. ఇక్కడ ఒక్కొక్కరికి రూ.1200 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రకృతి శిబిరాలు’ ప్రారంభించేందుకు అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ) ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలో వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌ ప్రాంతంలో,  ఖమ్మం శివారులోని అటవీ ప్రాంతంలోనూ ‘నేచర్‌ క్యాంప్‌’లను ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందుతోంది. ఆ తర్వాత రాష్ట్రంలో మరికొన్నిచోట్ల కూడా ఏర్పాటుచేయాలని ఎఫ్‌డీసీ భావిస్తోంది. 

రాత్రిళ్లు నిద్రించేందుకు ప్రకృతి ప్రేమికులు వేసుకున్న టెంట్లు 

అడవుల పట్ల అవగాహనకు.. 

పర్యావరణ పరిరక్షణ, అడవుల పట్ల అవగాహన కోసం ‘నేచర్‌ క్యాంప్‌’ కార్యక్రమాన్ని అటవీ అభివృద్ధి సంస్థ రూపొందించింది. ఎఫ్‌డీసీకి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అటవీ భూములున్నాయి. చిలుకూరు రక్షిత అటవీ ప్రాంతంలో బండరాళ్లు, ఖాళీ అటవీ ప్రాంతాన్ని ఎఫ్‌డీసీ ట్రెక్‌ పార్క్‌గా అభివృద్ధి చేసింది. ఉదయం, సాయంత్రం వేళలో వాకర్స్‌ వస్తున్నారు. అక్కడే రాత్రి బసచేసేలా ‘నేచర్‌ క్యాంప్‌’నకు శ్రీకారం చుట్టింది. పాఠశాల, కళాశాలల విద్యార్థులతో పాటు ప్రకృతి ప్రేమికులను ఈప్రాంతానికి అనుమతిస్తోంది. ఇక్కడ నిర్వహించే ప్రకృతి శిబిరంలో టీం బిల్డింగ్, టెంట్‌ ఎలా వేయాలో నేర్చుకోవడం, నైట్‌ ట్రెక్కింగ్, రాత్రి బస, క్యాంప్‌ ఫైర్, బర్డ్‌ వాక్‌తో పాటు అడ్వెంచర్‌ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చినవారికి.. బర్డ్‌వాక్‌కి వెళ్లే సమయంలో అక్కడి అటవీ ప్రాంతంలో ఉన్న పక్షుల గురించి అవగాహన కల్పిస్తారు. బర్డ్‌వాక్‌కు వెళ్లేటప్పుడు బైనాక్యులర్లు ఇస్తారు. వీటి సాయంతో దూరంగా ఉన్న పక్షులను వీక్షించొచ్చు. పర్యావరణ పర్యాటకం(ఎకో టూరిజం)లో భాగంగా ప్రకృతి శిబిరాలను రాష్ట్రంలో పలుచోట్ల నిర్వహించాలని ఎఫ్‌డీసీ నిర్ణయించింది.

అడవిలో రాత్రివేళ క్యాంప్‌ ఫైర్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు