చిరుధాన్యాల సాగుపై అన్నదాతల దృష్టి

రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్‌లో మరింత పెరగనుంది. ప్రజల్లో చిరుధాన్యాలకు ఆదరణ పెరగడంతో పాటు మార్కెట్లలో మంచి ధరలు రావడం, సాగు వ్యయం తక్కువగా ఉండటం, చీడపీడలను ఎదుర్కొని అధిక దిగుబడులు వస్తుండటంతో రైతులు ఈ పంటలను అధికంగా సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

Published : 09 Jun 2024 06:37 IST

పెరగనున్న విస్తీర్ణం 
విత్తనాలకు భారీ గిరాకీ 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్‌లో మరింత పెరగనుంది. ప్రజల్లో చిరుధాన్యాలకు ఆదరణ పెరగడంతో పాటు మార్కెట్లలో మంచి ధరలు రావడం, సాగు వ్యయం తక్కువగా ఉండటం, చీడపీడలను ఎదుర్కొని అధిక దిగుబడులు వస్తుండటంతో రైతులు ఈ పంటలను అధికంగా సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో విత్తనాలకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది.  

4.5 లక్షల ఎకరాల్లో సాగుకు అంచనా

యాసంగిలో రాష్ట్రంలో 2.46 లక్షల మేరకు చిరుధాన్యాలు సాగయ్యాయి. ఈసారి 4.5 లక్షల ఎకరాల మేరకు వీటిని సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. యాసంగిలో అనూహ్య వాతావరణ మార్పులను చిరుధాన్యాలు తట్టుకున్నాయి. పత్తి, వరి వంటి పంటల సాగుతో పోలిస్తే వీటి సాగు ఖర్చు 39 శాతం తక్కువగా ఉంది. చిరుధాన్యాల కంటే ప్రధాన పంటల విత్తనాల ధర 43 శాతం ఎక్కువగా ఉంది. పత్తి, వరి వంటి పంటల సాగుకు అధిక నీటి వినియోగం, మోతాదుకు మించిన ఎరువుల వినియోగంతో పాటు అధిక పనిభారం ఉంటుంది. చిరుధాన్యాల సాగుకు అంత ఇబ్బంది ఉండదు. మరోవైపు ప్రజల ఆహారపు అలవాట్లు, అభిరుచులతో వీటికి గిరాకీ పెరిగింది. ఉత్పత్తులకూ మంచి ధరలు లభిస్తున్నాయి.  జొన్నలు క్వింటాలుకు రూ.2970, సజ్జలకు రూ.2350, రాగులకు రూ.3578 చొప్పున మద్దతు ధరలు ఉండగా అంతకంటే అధికంగా ధరలు లభిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెఢ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు బహిరంగ మార్కెట్లలోనూ మద్దతు ధర లభిస్తోంది. 

చిరు ధాన్యాల పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సర్కారు అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధరలో ఏకంగా 65 శాతం రాయితీ కల్పిస్తోంది. మరోవైపు కేంద్రం కూడా ఈ పంటలను ప్రోత్సహించేందుకు జాతీయ ఆహార భద్రతా మిషన్‌ కింద మరో 25 శాతం రాయితీ ఇస్తోంది. మొత్తంగా విత్తన ధరలో 90 శాతం రాయితీ లభిస్తోంది. టీజీ సీడ్స్‌ తరఫున విక్రయించిన రాయితీ విత్తనాలతో సాగు చేసిన పంటలను తిరిగి కొనేందుకు రైతులతో ఒప్పందాలు చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. బలవర్ధక ఆహారంగా చిరుధాన్యాలను అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలకు సరఫరా చేయాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని