65 వేల అర్జీలు... 180 మంది సర్వేయర్లు

రాష్ట్రంలో 2016లో కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాలు ఏర్పడ్డాయి. అప్పుడే అన్ని శాఖలను పునర్‌ వ్యవస్థీకరించారు.

Updated : 09 Jun 2024 07:33 IST

దుస్థితిలో భూమి కొలతలు, భూ దస్త్రాల శాఖ
ఎనిమిదేళ్లుగా పునర్‌వ్యవస్థీకరణ ఊసే లేదు 
ఇప్పటికీ పాత జిల్లాల సిబ్బందితోనే నిర్వహణ
ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే ప్రారంభిస్తే కష్టమే 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2016లో కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాలు ఏర్పడ్డాయి. అప్పుడే అన్ని శాఖలను పునర్‌ వ్యవస్థీకరించారు. భూమి కొలతలు-భూ దస్త్రాల నిర్వహణ శాఖ (సర్వే అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌) శాఖలో మాత్రం మార్పులు చేయలేదు. ఫలితంగా పాత పది జిల్లాల సిబ్బంది, పోస్టులతోనే 33 జిల్లాల్లో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 65 వేలకుపైగా దరఖాస్తులు భూముల సర్వేకు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు సర్వేయర్లు, ఉప సర్వేయర్ల పోస్టులు 253 ఉండగా 180 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఈ లెక్కలు ఆ శాఖను పునర్‌ వ్యవస్థీకరించాల్సిన అవసరాన్ని చాటుతున్నాయి. 

సిబ్బంది ఖాళీలతో తీవ్ర ఇబ్బంది 

ప్రతి మండలానికి ఒక సర్వేయరు తప్పనిసరి. ఉమ్మడి రాష్ట్రంలో మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు మంజూరైన పోస్టులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భూముల వినియోగం, లావాదేవీలు, సమస్యలు కుప్పలుగా పెరిగినా భూమి కొలతల శాఖలో పోస్టులు పెరగడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో మండలాల సంఖ్య 613కు చేరింది. సిబ్బంది లేకపోవడంతో 150 మండలాలకు అదనపు బాధ్యతలున్న సర్వేయర్లే కొనసాగుతున్నారు. డిప్యూటీ సర్వేయర్ల లోటు చాలా ఎక్కువగా ఉంది. జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు పరిపాలన సిబ్బంది పోస్టులు సైతం పెరగాల్సి ఉంది. 

పటిష్ఠం చేయకుంటే సర్వేకు సమస్యే 

రాష్ట్రంలో చిక్కులు లేని భూదస్త్రాల నిర్వహణ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం సమగ్ర భూముల సర్వే చేపట్టాలని నిర్ణయించింది. అయితే, సర్వేయర్ల వ్యవస్థ పటిష్ఠంగా లేకుంటే ఇబ్బందులు తప్పవు. గత ప్రభుత్వం కూడా మూడేళ్ల క్రితం డిజిటల్‌ సర్వే చేపట్టాలని నిర్ణయించి, సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలని భావించింది. అధునాతన పరికరాల కొనుగోలు, సిబ్బందికి శిక్షణ తదితర ఖర్చులకు రూ.350 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. సీఎం, మంత్రులు నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గాల్లోని ఒక్కో గ్రామంతోపాటు ప్రతి జిల్లాకు రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేసింది. సర్వే సంస్థలతో ప్రీబిడ్‌ సమావేశం సైతం నిర్వహించింది. టెండర్లు పిలిచే దశలో సమగ్ర సర్వేకు స్వస్తి పలికింది. ప్రస్తుత ప్రభుత్వం సర్వే చేపట్టాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో మొదట భూమి కొలతల శాఖను పునర్‌ వ్యవస్థీకరించి పోస్టులు పెంచడం, కొత్త సిబ్బందిని నియమించడం, సర్వేకు సంబంధించిన అధునాతన పరికరాలను కొనుగోలు చేయడం లాంటి ముఖ్యమైన ప్రక్రియలను చేపట్టాల్సి ఉంది. అనంతరమే క్షేత్రస్థాయిలో సర్వేకు వెళ్లడం ద్వారా ప్రతి భూయజమానికి పక్కాగా టైటిల్‌ అందజేయడానికి వీలుంటుందని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు. మండల స్థాయిలో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులు లేకపోవడంతోనూ సర్వే సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సర్వేయర్లు పేర్కొంటున్నారు. 


పదేళ్లుగా బదిలీలు లేవు 

రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి భూమి కొలతల శాఖలో పూర్తి స్థాయి బదిలీలను చేపట్టలేదు. అత్యవసర పరిస్థితుల్లో డిప్యుటేషన్లు ఇస్తూ నెట్టుకొస్తున్నారు. ఈ శాఖపై సమగ్రమైన సమీక్షలు లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం, ఈ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్లను నియమించకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జోన్లకు అనుగుణంగా క్యాడర్‌లో మార్పులు చేయాల్సి ఉందని సూచిస్తున్నాయి. ‘‘తెలంగాణ ఆవిర్భావం అనంతరం శాఖలో బదిలీలు చేపట్టనేలేదు, ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురువుతున్నారు. శాఖ పునర్‌ వ్యవస్థీకరణతోపాటు కొత్త పోస్టులను మంజూరు చేసి, పటిష్ఠం చేయాలి’’ అని భూమి కొలతల శాఖ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) ప్రధాన కార్యదర్శి డి.ప్రశాంత్‌ కుమార్‌ విన్నవిస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని