మందుపాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు

ప్రజలు, వన్యప్రాణులు, మూగజీవాల ప్రాణాలతో మావోయిస్టులు చెలగాటమాడుతున్నారని జిల్లా ఎస్పీ శబరీష్‌ పేర్కొన్నారు.

Published : 10 Jun 2024 04:39 IST

పోలీసులు గుర్తించిన మందుపాతరకు అమర్చిన బ్యాటరీలు, వైరు

వెంకటాపురం, న్యూస్‌టుడే: ప్రజలు, వన్యప్రాణులు, మూగజీవాల ప్రాణాలతో మావోయిస్టులు చెలగాటమాడుతున్నారని జిల్లా ఎస్పీ శబరీష్‌ పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యంచేశారు. అదే ప్రాంతంలో మందుపాతరలు పేలి వన్యప్రాణి, మూగజీవి మృతి చెందినట్లు ఆదివారం బాంబుస్క్వాడ్‌ బృందం, పోలీసు బలగాలు గుర్తించాయి. ఇందుకు సంబంధించి ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. అవసరాల కోసం ప్రజలు నడిచే మార్గాలపై మావోయిస్టులు మందుపాతరలను అమర్చడంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో వీరభద్రవరం సమీపంలోని అటవీ ప్రాంతాన్ని బాంబు డిస్పోజల్‌ బృందం, పోలీసు బలగాలు తనిఖీలు నిర్వహించాయని, కాలిబాటలో ఉన్న మందుపాతరను గుర్తించి నిర్వీర్యం చేయగా, అదే ప్రాంతంలో మరో మూడు మందుపాతరలు పేలిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. అవి పేలడంతో ఓ అడవి పంది, పెంపుడు కుక్క మృతిచెందినట్లు గుర్తించామని వివరించారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు పోలీసులు సంసిద్ధంగా ఉన్నారన్నారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకునే చర్యలకు మావోయిస్టులు స్వస్తి పలకాలని పేర్కొన్నారు. మావోయిస్టులకు ప్రజలెవరూ సహకరించొద్దని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు