పామాయిల్‌ దిగుమతిపై కస్టమ్స్‌ సుంకం విధించాలి: హరీశ్‌రావు

పామాయిల్‌ దిగుమతిపై గతంలో తొలగించిన 15-43 శాతం కస్టమ్స్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం మళ్లీ విధించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు.

Published : 10 Jun 2024 04:40 IST

అక్కెనపల్లిలో ఆయిల్‌పామ్‌ గెలను తవ్వుతున్న ఎమ్మెల్యే హరీశ్‌రావు

నంగునూరు, న్యూస్‌టుడే: పామాయిల్‌ దిగుమతిపై గతంలో తొలగించిన 15-43 శాతం కస్టమ్స్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం మళ్లీ విధించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. దిగుమతులు పెరిగిన నేపథ్యంలో కస్టమ్స్‌ డ్యూటీ లేక పామాయిల్‌ సాగుచేసిన రైతులకు ధర కలిసి రావడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లిలో మొదటిసారిగా రైతు తిప్పని నాగేంద్రం మూడేళ్ల క్రితం వేసిన ఆయిల్‌పామ్‌ తోట నుంచి దిగుబడులు మొదలయ్యాయి. ఆదివారం హరీశ్‌రావు ఆ తోటలోని గెలల కోత పనులను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు ప్రారంభమైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రైతు భరోసా ఊసెత్తడం లేదని విమర్శించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 చొప్పున చెల్లించాలి. ఆయిల్‌పామ్‌ సాగు చేసిన రైతుల ప్రయోజనార్థం రూ.300 కోట్లతో నర్మెటలో చేపట్టిన దేశంలోనే పెద్దదైన పామాయిల్‌ తయారీ కర్మాగారం 2025 ఏప్రిల్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇది సిద్దిపేటతో పాటు జనగామ, మహబూబాబాద్, గద్వాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కేంద్రంగా ఉంటుంది’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. వడ్లకు రూ.500 బోనస్‌ చెల్లించడంలో జీలుగ, జనుము విత్తనాలు, ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు