డిగ్రీలోనూ కంప్యూటర్సే!

ఇంజినీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌ అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఇతర కోర్సులను మూసివేసుకొని సీఎస్‌ఈ సీట్లను కళాశాలల యాజమాన్యాలు భారీగా పెంచుకున్నాయి.

Updated : 10 Jun 2024 07:23 IST

బీకాం జనరల్, బీఎస్సీ జీవ, భౌతికశాస్త్ర కోర్సుల మూసివేత
డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్‌ కావాలంటున్న యాజమాన్యాలు
120 కళాశాలల నుంచి 200 కోర్సుల కన్వర్షన్‌కు దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌ అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఇతర కోర్సులను మూసివేసుకొని సీఎస్‌ఈ సీట్లను కళాశాలల యాజమాన్యాలు భారీగా పెంచుకున్నాయి. ఇప్పుడు అదే దిశగా డిగ్రీ విద్య వడివడిగా అడుగులు వేస్తోంది. డిమాండ్‌ లేని కోర్సులకు టాటా చెప్పి...విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కంప్యూటర్‌ సైన్స్, సంబంధిత కోర్సులు కావాలని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేశాయి.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల డిగ్రీ కోర్సుల మార్పునకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయా యాజమాన్యాలు డిమాండ్‌ లేని కోర్సులను మూసివేసి...తమకు ఇష్టమైన వాటిని ఆ స్థానంలో ప్రవేశపెట్టుకోవచ్చు. అందుకు గడువు గత నెల 25వ తేదీతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 120 కళాశాలల నుంచి దాదాపు 200 కోర్సులను మూసివేసి... కొత్తవి కావాలంటూ దరఖాస్తులు అందాయని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. అంటే డిమాండ్‌ లేని 10 వేలకుపైగా సీట్ల స్థానంలో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌లో గతంలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) బ్రాంచి మాత్రమే ఉండేది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా సీఎస్‌ఈ ఏఐ అండ్‌ ఎంఎల్, సైబర్‌ సెక్యూరిటీ, ఆ తర్వాత డేటా సైన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) తదితర కోర్సులు వచ్చాయి. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్‌ కోటాలో 84వేల వరకు బీటెక్‌ సీట్లు ఉండగా...అందులో సుమారు 57 వేలు కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత సీట్లే. ఇక ప్రైవేట్, డీమ్డ్‌ వర్సిటీల్లోని సీట్లను కలిపితే 75 శాతం అవే. వచ్చే కొత్త విద్యా సంవత్సరం(2024-25) మరిన్ని కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు రానున్నందున ఆ శాతం మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే కొద్ది సంవత్సరాల్లో డిగ్రీలోనూ అదే పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ‘విదేశీ విద్యకు వెళ్లాలంటే ఇంటర్‌ తర్వాత నాలుగేళ్ల విద్య అవసరం. అందుకోసమే గత విద్యా సంవత్సరం బీఎస్‌సీ ఆనర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పేరిట 13 కళాశాలల్లో కోర్సును ప్రవేశపెట్టాం. ఈసారి మరికొన్ని కళాశాలల్లో అందుబాటులోకి వస్తుంది’ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. అంతిమంగా ఉద్యోగాలు, ఉపాధి లభించేలా చేయడమే ధ్యేయంగా బీఎస్‌సీ డేటా సైన్స్, ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సులను ప్రవేశపెట్టామని చెప్పారు. 

 ఏ కోర్సులకు డిమాండ్‌?

బీకాం జనరల్, బీఎస్‌సీ జీవ, భౌతికశాస్త్రాల కోర్సులను మూసివేసి...వాటి స్థానంలో బీకాం కంప్యూటర్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ బిజినెస్‌ ఎనలిటిక్స్, బీఎస్‌సీ డేటా సైన్స్, బీసీఏ, మరికొన్ని బీబీఏ డేటా ఎనలిటిక్స్‌ లాంటి కోర్సులకు దరఖాస్తులు అందాయి. కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకుండా బీకాం చదివినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే పరిస్థితి లేదని, దానికితోడు మార్కెట్లో డిమాండ్‌ ఉన్న డేటా సైన్స్, డేటా ఎనలిటిక్స్‌ తదితర వాటిల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పరమేశ్వర్‌ తెలిపారు. ఒకప్పుడు కేవలం డిగ్రీ కోసం ఏదో ఒక కోర్సులో చేరేవారని... ఇప్పుడు ఉద్యోగం వస్తుందా? ప్రాంగణ నియామకాలు ఉంటాయా? అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం ఎంఎస్‌సీ, ఆ తర్వాత పరిశోధన చేసే ఆసక్తి ఉన్న వారే బీఎస్‌సీ లైఫ్‌ సైన్సెస్, ఫిజిక్స్‌లో చేరుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని