రైతుల ఖాతాల్లో రూ.10,355 కోట్లు

యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయగా, 6,345 కేంద్రాల ద్వారా 47.07 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 10 Jun 2024 04:43 IST

ధాన్యం అమ్మిన మూడు రోజుల్లోనే నగదు జమ
వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయగా, 6,345 కేంద్రాల ద్వారా 47.07 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,355.18 కోట్లు జమచేసినట్టు వెల్లడించింది. వడ్లు అమ్మిన మూడు రోజుల్లోనే డబ్బు ఖాతాలో వేసినట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈసారి ధాన్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయని తెలిపింది.

‘గత ప్రభుత్వ హయాంలో ఏప్రిల్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. ఈసారి దాదాపు రెండు వారాల ముందుగా మార్చి 25 నుంచే ప్రారంభించాం. జూన్‌ 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రంలో చాలాచోట్ల సేకరణ ప్రక్రియ పూర్తయింది. మరో 10 రోజులపాటు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ఆలస్యంగా పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా నెలాఖరు వరకు అవసరమైన చోట్ల కేంద్రాలు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశామని’ వివరించింది. యాసంగి సీజన్‌లో దాదాపు 75.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని పౌరసరఫరాల శాఖ తొలుత అంచనా వేసిందని, మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ సొమ్ము లభించడం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు కొనుగోలు చేయడం వల్ల అంచనా వేసిన విధంగా ధాన్యం రాలేదని’ సర్కారు వివరించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని