పెండింగ్‌లో 2.06 లక్షల ధరణి దరఖాస్తులు

రాష్ట్రంలో పెండింగ్‌ భూ సమస్యలు తరగడం లేదు. ధరణిలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం మార్చిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది.

Published : 10 Jun 2024 04:44 IST

వేగం పెంచాలని రెవెన్యూ శాఖకు కమిటీ సూచన
రెండు మూడు రోజుల్లో మంత్రితో భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెండింగ్‌ భూ సమస్యలు తరగడం లేదు. ధరణిలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం మార్చిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను జూన్‌ 4లోపు పరిష్కరించాలని లక్ష్యం నిర్దేశించింది. అయితే పరిష్కార ప్రక్రియలో వేగం తగ్గడంతోపాటు.. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో డ్రైవ్‌ను రెవెన్యూ శాఖ నిలిపివేసింది. దీంతో లక్ష దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. వీటికి పాసు పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. మరో 1.46 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. లోక్‌సభ ఎన్నికలు ముగిసి కోడ్‌ తొలగిపోయే లోపు వివిధ సమస్యలకు సంబంధించి ధరణిలో మరో 60 వేల దరఖాస్తులు వచ్చాయి. దీంతో మళ్లీ పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య 2.06 లక్షలకు చేరుకుంది.

గతంలో తిరస్కరణలతోనే..

రైతులు గత ఏడాది అక్టోబరుకు ముందు ధరణి పోర్టల్‌లో చేసుకున్న దరఖాస్తులను కొన్ని జిల్లాల కలెక్టర్లు ఎడాపెడా తిరస్కరించారు. నెలనెలా దరఖాస్తుల పరిష్కారాలకు సంబంధించి ప్రభుత్వం లక్ష్యం విధించడంతో కలెక్టర్లు ఏ చిన్న లోపం కనిపించినా తిప్పి పంపించారు. పలు సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి విచారణల్లో జాప్యం జరిగినా.. దస్త్రాలు అందుబాటులో లేకపోయినా తిరస్కరించారని సంబంధిత రైతులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పుడు రెవెన్యూ శాఖ అన్ని సమస్యలపై దృష్టి పెడుతుండటంతో రైతులు తిరిగి దరఖాస్తు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతోపాటు ధరణి కమిటీ కూడా భూ సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి రెవెన్యూ శాఖకు సూచనలు, సలహాలు ఇస్తోంది. పెండింగ్‌ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల కూడా భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు సూచించింది. చాలాకాలం నుంచి భూ సమస్యలు పరిష్కారం కాక ఎదురుచూపుల్లో గడిపిన రైతులు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ధరణి కమిటీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ కానుంది. కమిటీ చేపట్టిన అధ్యయనం, రెవెన్యూ శాఖ తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి రూపొందించిన నివేదికపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని