ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Updated : 10 Jun 2024 06:07 IST

నాలుగైదింటిని ఒక సాంకేతిక బృందానికి అప్పగించే యోచన
ఒకట్రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన 

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే పద్మావతి 

హుజూర్‌నగర్, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నాలుగు, ఐదు పథకాలను ముగ్గురితో కూడిన సాంకేతిక బృందానికి అప్పగిస్తామన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం... కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘అధికారంలోకి రాకముందు ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్‌ పాదయాత్ర చేశారు. కానీ, పదేళ్లు అధికారంలో ఉన్నా ఆ ఊసే ఎత్తలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించాం. రైతు కమిటీలకు అప్పగిస్తే... సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మరమ్మతులు చేయించడంలేదు. వాటిని బాగు చేయడానికి ఏళ్ల సమయం పడుతోంది. ఫలితంగా పథకాలు పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయడం లేదు. అందుకే ప్రతి నాలుగైదు ఎత్తిపోతలకు ఒక ఫిట్టర్, ఆపరేటర్, ఎలక్ట్రీషియన్‌ను తాత్కాలిక పద్ధతిలో నియమించాలని నిర్ణయించాం. ఈ ప్రత్యేక సాంకేతిక బృందాల జీతభత్యాలను ప్రభుత్వమే భరిస్తుంది. తొలుత దీన్ని ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు జిల్లాల్లో అమలు చేస్తాం. దీనివల్ల ఆయా ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో పనిచేసి మొత్తం ఆయకట్టుకే కాకుండా అదనపు ఆయకట్టుకు సైతం నీరు అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులను త్వరలోనే ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. అలాగే అన్ని రేషన్‌ కార్డులకు సన్నబియ్యం ఇవ్వాలనే యోచన కూడా చేస్తున్నాం’’ అని మంత్రి ఉత్తమ్‌ వివరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని