ఏఐ రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం

రపంచంలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో హైదరాబాద్‌ను రాజధానిగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

Published : 10 Jun 2024 04:46 IST

ఆటా బిజినెస్‌ సెమినార్‌లో మంత్రి శ్రీధర్‌బాబు

అమెరికాలో ఆటా బిజినెస్‌ సెమినార్‌లో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో హైదరాబాద్‌ను రాజధానిగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో ఏఐ వృద్ధిని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించిందని, కేవలం పెద్ద తరహా పరిశ్రమలకే కాకుండా.. మధ్య స్థాయి, చిన్న స్థాయి పరిశ్రమలను కూడా వర్గీకరణ చేసి ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఆటా(అట్లాంట తెలుగు అసోసియేషన్‌-ఏటీఏ) బిజినెస్‌ సెమినార్‌లో శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. తెలంగాణలోని పారిశ్రామికాభివృద్ధిలో పాలుపంచుకోవాలని అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. అందుకు అవసరమైన సంపూర్ణ మద్దతును ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఈ సెప్టెంబరులో హైదరాబాద్‌లో జరిగే ‘గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌’కు ‘అమెరికన్‌ ఇండియన్‌ డయాస్పోర్‌’ ప్రతినిధులను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని మంత్రి చెప్పారు. ‘‘తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్థిరమైన ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన బలమైన సంస్కృతిని పెంపొందించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వ్యవస్థను బలోపేతం చేయడం, శ్రామికశక్తి నైపుణ్యాలను పెంపొందించే విధానాలకు వెన్నంటి ఉండడం ద్వారా రాష్ట్రంలో సమృద్ధిగా ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. సెమీ కండక్టర్స్, వైద్య పరికరాల పరిశ్రమల కోసం ప్రత్యేకంగా భూములను, భవనాలను కేటాయించాం. వీటిలో పురోగతిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో మౌలిక సదుపాయాలకు మెరుగైన ప్రభుత్వ విధానాలను తయారు చేస్తున్నాం. కేవలం హైదరాబాద్‌ పరిసరాలకే పరిశ్రమలు పరిమితం కాకుండా.. రాష్ట్రంలో సెమీ అర్బన్, గ్రామీణ తెలంగాణలోనూ పారిశ్రామికాభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నాం’’ అని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు