మూగజీవాలకు అందని వైద్యం

రాష్ట్రవ్యాప్తంగా 388 గ్రామీణ పశువైద్యశాలలు 11 ఏళ్లుగా మూతపడ్డాయి. పశుసంవర్ధక శాఖలో వైద్యసిబ్బంది ఖాళీల కారణంగా ఈ దయనీయ స్థితి నెలకొంది.

Published : 10 Jun 2024 05:57 IST

ఏళ్లుగా మూతపడి ఉన్న గ్రామీణ పశువైద్యశాలలు
పశుసంవర్ధకశాఖలో భారీగా ఖాళీలు.. భర్తీలో తాత్సారం

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్‌ మండలం రామన్నగూడెంలో మూతపడి శిథిలావస్థకు చేరిన గ్రామీణ పశు వైద్యశాల 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 388 గ్రామీణ పశువైద్యశాలలు 11 ఏళ్లుగా మూతపడ్డాయి. పశుసంవర్ధక శాఖలో వైద్యసిబ్బంది ఖాళీల కారణంగా ఈ దయనీయ స్థితి నెలకొంది. పల్లెల్లోనే పశువైద్య సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు మూతపడడంతో మూగజీవాలకు వైద్యం అందడం లేదు. రాష్ట్రంలో 9 జిల్లా, 99 నియోజకవర్గ, 909 మండల, 1101 గ్రామీణస్థాయి పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల వద్దకే నేరుగా వెళ్లి సేవలందించేందుకు 100 సంచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ శాఖలో ఆది నుంచి భారీఎత్తున ఖాళీలు ఉండగా.. 2018లో ప్రభుత్వం 460 వెటర్నరీ అసిస్టెంట్లు, 250 పశువైద్యుల పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత పదవీ విరమణలు, ఇతర కారణాలతో ఖాళీలు పెరిగినా భర్తీ కావడం లేదు. 

పదోన్నతుల వ్యవహారం తేలక.. 

మొత్తం ఈ శాఖలో 2065 పోస్టులకు గాను 535 ఖాళీలున్నాయి. వాటిలో 22 వెటర్నరీ లైవ్‌స్టాక్‌ ఆఫీసర్, 20 జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్, 387 లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్, 106 వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 40.32 లక్షల తెల్లజాతి, 42.26 లక్షల నల్లజాతి పశువులు, 1.90 కోట్ల గొర్రెలు, 49 లక్షల మేకలున్నాయి. ఇవి వ్యాధుల బారిన పడినప్పుడు గ్రామీణ కేంద్రాలకు తరలిస్తుండగా అవి మూతపడి ఉండడంతో సేవలు అందడం లేదు. మూతపడిన 388 వైద్యశాలల్లో లైవ్‌స్టాక్‌ అసిస్టెంటు పోస్టుల భర్తీ చేస్తేనే అవి పునఃప్రారంభయ్యే వీలుంది. వెటర్నరీ అసిస్టెంట్లకు లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే వాటిని తెరిచే అవకాశం ఉంటుంది. పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వెటర్నరీ డిప్లొమా, వొకేషనల్‌ డెయిరీ కోర్సు విద్యార్హతలు గల వారు 2018లో ఎంపిక కాగా.. డిప్లొమా ఉన్న వారు నేరుగా నియామక పత్రం పొందారు. వొకేషనల్‌ డెయిరీ కోర్సు చేసిన వాళ్లు ఒక సంవత్సరం శిక్షణ పూర్తిచేసుకుని విధుల్లో చేరారు. వీరికి లైవ్‌స్టాక్‌ అసిస్టెంటుగా పదోన్నతి కల్పించాల్సి ఉండగా సీనియారిటీపై సందిగ్ధం ఏర్పడింది. దీంతో పశుసంవర్ధక అధికారులు సీనియారిటీని నిర్ధారించాలని కోరుతూ రెండేళ్ల క్రితం సాధారణ పరిపాలనశాఖకు లేఖ రాయగా.. ఇప్పటి వరకు దానిపై సమాధానం రాలేదు. ఒకవైపు సిబ్బంది కొరత ఉండగా.. 80 మందిని ఇతర శాఖలకు డిప్యుటేషన్‌పై పంపించడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మేరకు టీఎన్జీవో అసోసియేషన్‌ వెటర్నరీ ఫోరం ఉపాధ్యక్షుడు గణేశ్‌రెడ్డి మాట్లాడుతూ...  ‘‘జీఏడీలో రెండేళ్లకుపైగా సీనియారిటీ దస్త్రం పెండింగులో ఉండడం బాధాకరం. వెటర్నరీ అసిస్టెంట్లు అర్హులై ఉండి, ఖాళీలు ఉన్నా పదోన్నతులకు నోచుకోవడం లేదు. తాత్కాలిక పదోన్నతుల ద్వారానైనా గ్రామీణ వైద్యకేంద్రాలను పునఃప్రారంభించే వీలుంది’’ అని సూచించారు. దీనిపై పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా... సీనియారిటీ ఖరారు గురించి రెండేళ్లుగా జీఏడీకి ఎప్పటికప్పుడు లేఖలు రాస్తున్నామని.. సమాధానం రాగానే పదోన్నతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని