నేడు కమిషన్‌ ముందుకు బ్యారేజీల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ)లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్‌సింగ్‌లను న్యాయ విచారణ కమిషన్‌ సోమవారం విచారించనుంది.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ)లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్‌సింగ్‌లను న్యాయ విచారణ కమిషన్‌ సోమవారం విచారించనుంది.

Published : 10 Jun 2024 06:03 IST

తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్‌సింగ్‌లకు పిలుపు 

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ)లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్‌సింగ్‌లను న్యాయ విచారణ కమిషన్‌ సోమవారం విచారించనుంది. బ్యారేజీలకు సంబంధించిన పలు అంశాలపై కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ వారిని ప్రశ్నించనున్నారు. హైదరాబాద్‌లోని కమిషనర్‌ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రభుత్వం సూచించిన టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లోని ప్లానింగ్, డిజైన్స్, కన్‌స్ట్రక్షన్‌లతోపాటు అనేక ఇతర అంశాలపై ముగ్గురు ఈఈలను విచారించనున్నారు. టెయిల్‌ వాటర్, షూటింగ్‌ వెలాసిటీ(బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల సమయంలో పడే దూరం) అంశాలపై ప్రశ్నించనుంది. బ్యారేజీల నుంచి సెకనుకు 4.8 నుంచి 5 మీటర్ల వరకు షూటింగ్‌ వెలాసిటీ ఉండాల్సి ఉంది. దీనికి భిన్నంగా 16 నుంచి 18 మీటర్ల వరకు వస్తోంది. ఈ తేడాలతో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, నిర్మాణాలు దెబ్బతినడం వంటివి సంభవిస్తున్నాయి. బ్యారేజీలో ఇసుక పేరుకుపోవడం, నిర్మాణ సంస్థలు, నీటిపారుదలశాఖతో ఈఈలు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలపైనా కమిషన్‌ దృష్టిసారించనున్నట్లు తెలిసింది. 

క్షేత్రస్థాయిలో సమాచారం మేరకు 

ఇప్పటికే కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ మూడు బ్యారేజీలనూ సందర్శించారు. మూడో దఫాలో భాగంగా శుక్రవారం అన్నారం, శనివారం సుందిళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత భారీ నిర్మాణాలు చేపడుతున్న సమయంలో కనీస బాధ్యత ఉండదా అంటూ ఇంజినీర్లపై, నిపుణులైన మీరు ఏ పని చేస్తున్నారో తెలుసుకోరా అంటూ నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ బ్లాక్స్, బుంగలు ఇతర లోపాలను నిశితంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈఈలను ఆయా అంశాలపై ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని