సంక్షిప్త వార్తలు (6)

రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో కొత్తగా నియమితులైన వారికి పోస్టింగులు ఇవ్వడానికి ముందుగానే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు...

Updated : 11 Jun 2024 05:59 IST

పోస్టింగులకు ముందే పదోన్నతులు కల్పించాలి
టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో కొత్తగా నియమితులైన వారికి పోస్టింగులు ఇవ్వడానికి ముందుగానే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి బదిలీలు నిర్వహించాలని ఎస్సీ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలరాజు, ఎన్‌.దయాకర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనరల్, బీసీ, మైనార్టీ గురుకులాల్లో 2018, 2019లో ఉద్యోగాల్లో చేరిన వారికి పదోన్నతులు లభించాయని, ఎస్సీ సొసైటీలో పదోన్నతులు కల్పించలేదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీవో నం. 317 బాధితులకు న్యాయం చేయాలని కోరారు.


పీజీఈసెట్‌కు తొలిరోజు 93.34 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త విద్యా సంవత్సరంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్‌ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు 12,938 మందికి 12,077 మంది(93.34 శాతం) హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్‌ జేఎన్‌టీయూహెచ్‌కు వెళ్లి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.  రెక్టార్‌ ఆచార్య కె.విజయ కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.వెంకటేశ్వర్‌రావు, కన్వీనర్‌ ఎ.అరుణకుమార్, కో కన్వీనర్‌ బి.రవీంద్రరెడ్డి ఉన్నారు. పరీక్షలు ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్నాయి.


జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చూపారని గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 ఏడాదికి 400 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని, వారిలో 47 మంది ప్రత్యక్ష ర్యాంకులు పొందగా.. 138 మందికి ప్రిపరేటరీ ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు. వెయ్యిలోపు కమ్యూనిటీ ర్యాంకులు 34 మందికి లభించాయని వివరించారు.


మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్‌ బెయిల్‌

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉంటున్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు 5 రోజుల మధ్యంతర ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది. రాధాకిషన్‌రావు తల్లి సరోజినీదేవి జూన్‌ 2న మరణించారు. తల్లి దశ దినకర్మలో పాల్గొనేందుకు అనుమతివ్వాలని కుటుంబసభ్యులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సోమవారం నుంచి శుక్రవారం వరకు బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో జైలు అధికారులు సోమవారం ఆయనను జనగామకు తరలించారు.


కేంద్ర మంత్రులు  దేశాభివృద్ధికి కృషి చేయాలి

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానమంత్రి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి(తెలంగాణ), బండి సంజయ్‌(తెలంగాణ), కింజరాపు రామ్మోహన్‌నాయుడు(ఆంధ్రప్రదేశ్‌), పెమ్మసాని చంద్రశేఖర్‌(ఆంధ్రప్రదేశ్‌), భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ(ఆంధ్రప్రదేశ్‌) దేశాభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి సోమవారం ఒక ప్రకటనలో గుత్తా శుభాకాంక్షలు తెలిపారు.


తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలి

-మాజీ ఎంపీ వినోద్‌

కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి వారు పాటుపడాలని ఒక ప్రకటనలో ఆయన ఆకాంక్షించారు.


గోపాలమిత్రలకు పీఆర్సీ వేతన బకాయిల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: పశుగణాభివృద్ధి సంస్థ పరిధిలో పనిచేస్తున్న 1530 మంది గోపాలమిత్రలకు 21 నెలల పీఆర్‌సీ వేతన బకాయిలు రూ. 7.36 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు విడుదల చేయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు గోపాలమిత్ర సేవాసంఘం అధ్యక్షుడు చెరకు శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని