ఐఐటీ అబుధాబి ప్రాంగణంలో బీటెక్‌ కోర్సులు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజధాని అబుధాబిలో ఐఐటీ దిల్లీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రాంగణంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులతో ఈ ఏడాది బీటెక్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Published : 11 Jun 2024 04:22 IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్లకు 20 సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజధాని అబుధాబిలో ఐఐటీ దిల్లీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రాంగణంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులతో ఈ ఏడాది బీటెక్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకోసం సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక పోర్టల్‌ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. బీటెక్‌ సీఎస్‌ఈ, ఎనర్జీ ఇంజినీరింగ్‌ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ఒక్కో దాంట్లో 30 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో కోర్సులో 10 సీట్లను అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్లకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను యూఏఈలో నివసించే వారికి కేటాయిస్తారు. వారు ఐఐటీ దిల్లీ నిర్వహించే కంబైన్డ్‌ అడ్మిషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీఏఈటీ)లో ఉత్తీర్ణులు కావాలి. ఈ ప్రాంగణంలో సెప్టెంబరులో తరగతులు ప్రారంభం కానున్నాయి. గత విద్యాసంవత్సరం (2023-24) ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలో ఐఐటీ మద్రాస్‌ ప్రాంగణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఐఐటీ మద్రాస్‌లో క్రీడా కోటా

కొత్త విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ మద్రాస్‌లో క్రీడా కోటా కింద ఒక్కో బ్రాంచిలో రెండు బీటెక్‌ సీట్లు కేటాయించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారికే ఈ సీట్లు కేటాయిస్తారు. ఆయా విద్యార్థులు గత నాలుగేళ్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని కనీసం ఒక పతకం సాధించి ఉండాలి. వీటికి దరఖాస్తు ప్రక్రియ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభం: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ నెల 20న తొలి విడత సీట్లు కేటాయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని