టెస్కాబ్‌ అధ్యక్షుడిగా రవీందర్‌రావు ఉపాధ్యక్షుడిగా సత్తయ్య

తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంకు (టెస్కాబ్‌) తాత్కాలిక అధ్యక్షుడిగా మార్నేని రవీందర్‌రావు, ఉపాధ్యక్షుడిగా కొత్త కుర్మ సత్తయ్యలు నియమితులయ్యారు.

Published : 11 Jun 2024 04:32 IST

సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న రవీందర్‌రావు.. చిత్రంలో సత్తయ్య

ఈనాడు, హైదరాబాద్‌:   తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంకు (టెస్కాబ్‌) తాత్కాలిక అధ్యక్షుడిగా మార్నేని రవీందర్‌రావు, ఉపాధ్యక్షుడిగా కొత్త కుర్మ సత్తయ్యలు నియమితులయ్యారు. సహకార శాఖ సంచాలకురాలు, రిజిస్ట్రార్‌ హరిత సోమవారం వారికి నియామక పత్రాలు అందించారు. ప్రస్తుతం రవీందర్‌రావు వరంగల్‌ డీసీసీబీకి, సత్తయ్య రంగారెడ్డి డీసీసీబీకి అధ్యక్షులుగా ఉన్నారు. 2020లో టెస్కాబ్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కొండూరి రవీందర్‌రావు, గొంగిడి మహేందర్‌రెడ్డి ఇటీవల తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వారి స్థానంలో తాత్కాలికంగా అధ్యక్ష, ఉపాధ్యక్షులను నియమించారు. సోమవారం టెస్కాబ్‌లో జరిగిన సమావేశానికి కొండూరి రవీందర్‌రావు, మహేందర్‌రెడ్డి మినహా మిగిలిన ఏడుగురు సభ్యులు హాజరయ్యారు. టెస్కాబ్‌ పాలకవర్గానికి వచ్చే ఫిబ్రవరి వరకు సమయం ఉంది. గడువు తక్కువగా ఉన్నందున ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా తాత్కాలికంగా నియమించినట్లు హరిత ప్రకటించారు. అనంతరం తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్‌రెడ్డిని రవీందర్‌రావు, సత్తయ్య కలిశారు. టెస్కాబ్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ముఖ్యమంత్రికి శాలువా, పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా వారు మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని