ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై కౌంటర్లు దాఖలు చేయండి: హైకోర్టు

భారాస నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై ఇచ్చిన అనర్హత పిటిషన్‌లపై విచారణ ఏ దశలో ఉందో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన స్పీకర్‌ కార్యాలయంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 11 Jun 2024 04:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారాస నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై ఇచ్చిన అనర్హత పిటిషన్‌లపై విచారణ ఏ దశలో ఉందో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన స్పీకర్‌ కార్యాలయంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ భారాస శాసనసభ్యులు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్పీకర్‌ వద్ద పిటిషన్‌లపై విచారణ ఏ దశలో ఉందో చెప్పాలంటూ కోర్టు గత వారం ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అనర్హత పిటిషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామంటూ అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. దీంతో భారాస ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌లను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘాలకు ఆదేశాలు జారీ చేస్తూ.. విచారణను జులై 27వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని