దెబ్బతిన్న రహదారులకు మోక్షం!

రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశం నేపథ్యంలో రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Published : 11 Jun 2024 04:42 IST

యుద్ధప్రాతిపదికన మరమ్మతులపై సర్కారు దృష్టి 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశం నేపథ్యంలో రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. బాగు చేయాల్సిన రాష్ట్ర, గ్రామీణ రహదారులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ గడిచిన కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు పనులు నిర్వహించిన గుత్తేదారులకు బకాయిలు చెల్లించకపోవటంతో భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను బాగు చేయించటం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో సుమారు మూడు వేల కిలోమీటర్ల మేరకు రహదారులు దెబ్బతిన్నా.. తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టారు.

రహదారుల గుర్తింపు

దెబ్బతిన్న రహదారులను గుర్తించాలని ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేయడంతో.. డివిజన్ల వారీగా గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టారు. ఎంతమేరకు దెబ్బతిన్నాయి.. ఎన్ని కిలోమీటర్ల మేరకు తక్షణం మరమ్మతులు చేయాల్సి ఉంది.. తదితర సమాచారాన్ని మంగళ, బుధవారాల నాటికి సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత ఖర్చు అంచనాలు రూపొందిస్తారు. ఆ ప్రక్రియ పూర్తి చేసిన మీదట టెండర్లు ఆహ్వానించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో వర్షాల ఉద్ధృతికి ముందే అత్యవసరంగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. రహదారుల నిర్వహణ బాధ్యత నిర్మించినప్పటి నుంచి అయిదేళ్ల వరకు గుత్తేదారులకే ఉన్న నేపథ్యంలో అయిదేళ్లకు ముందు నిర్మించిన రోడ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. మరమ్మతులకు రూ.1,500 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. గతంలో చేసిన పనులకు రహదారులు, భవనాల శాఖ గుత్తేదారులకు ప్రభుత్వం పెద్దమొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు అవసరమైనన్ని నిధులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని