తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తీసుకొచ్చే కీలకమైన బొగ్గు, గనులశాఖలు అప్పగించినందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Published : 11 Jun 2024 05:35 IST

రెండు శాఖల ఆదాయం పెంచేందుకు కృషి  
కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తీసుకొచ్చే కీలకమైన బొగ్గు, గనులశాఖలు అప్పగించినందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తెచ్చేలా తాను ఈ బాధ్యతలు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. సోమవారం కేంద్ర మంత్రుల శాఖల కేటాయింపు అనంతరం ఆయన దిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 

‘‘ఒకటి రెండు రోజుల్లో కొత్త మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో మాట్లాడి వంద రోజుల ఎజెండా కార్యాచరణ మొదలుపెడతాం. బొగ్గు గనుల కేటాయింపు, తవ్వకాలు, సరఫరా, పర్యావరణ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం ఇవన్నీ మా శాఖ చేయాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఈ శాఖను సమర్థంగా నిర్వహించడానికి పట్టుదలతో పనిచేస్తా. ఇది చాలా పెద్దశాఖ. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా. దేశంలో ఎక్కడా బొగ్గు కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పూర్తి అవగాహన చేసుకొని పని మొదలుపెడతా. గనుల వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటాయి. ఇసుకకు రాష్ట్ర ప్రభుత్వాలే అనుమతులిస్తాయి. ఇతర గనుల తవ్వకాలు, ఖనిజ ఉత్పత్తి విధాన నిర్ణయాలు కేంద్రంలో జరుగుతాయి. ఈ రెండు శాఖలు దేశానికి ఆదాయం తెచ్చే శాఖలు. తప్పకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తా. మోదీ ప్రధానమంత్రి కాకముందు దేశంలో బొగ్గు కొరత వల్ల విద్యుత్తు సమస్య ఉండేది. ఆయన బాధ్యతలు చేపట్టాక సమస్య తీరింది. కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకతతో బొగ్గు గనుల వేలం నిర్వహిస్తోంది. గతంలో యూపీయే హయాంలో కుంభకోణాలు జరిగితే మోదీ హయాంలో నీతి నిజాయతీతో పారదర్శకంగా వేలం సాగుతోంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఎన్ని బొగ్గుగనులు ఉన్నాయి, అవి ఎన్నేళ్లు అందుబాటులో ఉంటాయో తదితర విషయాలపై అధ్యయనం చేస్తా’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.


వరంగల్‌కు త్వరగా ఎయిర్‌పోర్టు వచ్చే అవకాశం

తెలుగురాష్ట్రాలకు చెందిన మిగతా నలుగురు మంత్రులకు మంచి శాఖలు కేటాయించినందుకు కిషన్‌రెడ్డి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఏపీలో చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తున్నారని, తాను కూడా హాజరవుతానని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగురాష్ట్రాలు మరింత వేగంగా, ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా కేంద్రం అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. రామ్మోహన్‌నాయుడికి పౌర విమానయానశాఖ ఇవ్వడంవల్ల వరంగల్‌కు త్వరగా కొత్త ఎయిర్‌పోర్టు రావడానికి వీలవుతుందని, రీజినల్‌ రింగ్‌రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని